Trump on Illegal Immigration: అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్లు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో వలసలు తగ్గాయని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను విధించిన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలతో ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో సరిహద్దుల్లో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే పట్టుబడ్డారని పేర్కొన్నారు. అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, తమ దేశంపై వలసల దండయాత్ర ముగిసిందన్నారు.
బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు నెలకు 3 లక్షలమంది
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా దేశంలోకి 3 లక్షలమంది అక్రమంగా ప్రవేశించేవారని పేర్కొన్నారు. ఈ గణాంకాలకు సంబంధించి సీబీపీ రిలీజ్ చేసిన నివేదికలను ప్రస్తావించారు. దాదాపు 95 శాతం వలసలు తగ్గినట్లు వెల్లడించారు. ‘యూఎస్–మెక్సికో సరిహద్దు వద్ద బోర్డర్ పెట్రోల్ ద్వారా కేవలం 8,326 మంది అక్రమార్కులు మాత్రమే పట్టుబడ్డారు. వారందరినీ వెంటనే మా దేశం నుంచి పంపించాము. అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలపై విచారణ జరుపుపుతున్నాం’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
అక్రమ వలసలకు చెక్ పెట్టాం
తన పాలనలో అక్రమ వలసలకు చెక్ పెట్టామని ట్రంప్ ఉద్ఘాటించారు. అక్రమ వలసలకు సరిహద్దులను క్లోజ్ చేశామన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
తప్పుబట్టిన వార్తా సంస్థలు
ట్రంప్ ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పుబట్టాయి. ఆయన చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దుయ్యబట్టాయి. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్ పంచుకుంది. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు యావరేజ్‌గా 2,869 మందితో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు స్పష్టం చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో 7,287 మంది పట్టుబడ్డారని పేర్కొంది. ఇది 95 శాతం తగ్గుదల కాదని, కేవలం 60శాతం మాత్రమేనని వెల్లడించింది.
స్వదేశాలకు సాగనుంపుతున్న అధికారులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్రమంగా వలస వెళ్లిన కొందరు భారతీయుల్ని ఇప్పటికే సైనిక విమానాల్లో వెనక్కి పంపించింది. ఇండియన్స్‌తోపాటు మరికొంతమందిని కూడా తమ దేశాలకు పంపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.