Trinamool MP Mahua Moitra marries BJD Leader Pinaki Misra : పార్లమెంట్ మహిళా ఎంపీల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మహువా మొయిత్రా పెళ్లి చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC తరపున కృష్ణానగర్ నుండి రెండుసార్లు విజయం సాధించారు. మాజీ బిజూ జనతాదళ్ (BJD) ఎంపీ పినాకి మిశ్రాతో 2025 మే 3న జర్మనీలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అత్యంత రహస్యంగా జరిగింది.ఈ అంశంపై మహువా మొయిత్రా లేదా TMC నుండి అధికారిక ధృవీకరణ లేనదు. కానీ పెళ్లి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొయిత్రా సాంప్రదాయ దుస్తుల్లో, మిశ్రాతో కలిసి నవ్వుతూ చేతిలోచేయి వేసి నడుస్తూ కనిపించారు.
వీరిద్దరి మధ్య వయసు తేడా పదిహేను ఏళ్లు ఉంది. పినాకి మిశ్రా వయసు అరవై ఐదు కాగా.. మహువా మొయిత్రా వయసు యాభై ఏళ్లు. పినాకిమిశ్రా 2019 ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 117 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మిశ్రా 1984లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్సియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకుని, తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె అడ్వకేట్ జై అనంత్ దేహద్రాయ్‌తో సుమారు మూడేళ్ల పాటు సహజీవనంచేశారు. ఆ సంబంధం నిలబడలేదు. తర్వాత ఆయనను “జిల్టెడ్ ఎక్స్”గా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.ఆ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఆమెపై అనర్హతా వేటు వేశారు లోక్ సభ స్పీకర్. తర్వాత ఎన్నికల్లో మరోసారి ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు.
మొయిత్రా రాజకీయ జీవితంలో వివాదాలు సర్వసాధారణం. ఆమె బిజెపి ఎంపీ నిషికాంత్ దుబే, జై అనంత్ దేహద్రాయ్‌పై 2025 మేలో డిఫమేషన్ కేసు వేశారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, పహల్గామ్ ఉగ్రదాడి వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మహువా మొయిత్రా కేంద్రాన్ని దూకుడుగా విమర్శిస్తున్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ లో ఆమెకు అంత మద్దతు లభించడం లేదు. ఆమె స్థానికంగా అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మహువా మొయిత్రా ఉన్నత విద్యాధికురాలు. బెంగాల్ మూలాలు కలిగి ఉన్నప్పటికి అత్యధిక కాలం విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చారు. విషయ పరిజ్ఞానం, మంచి వాగ్దాటి ఉన్న ఆమె దూకుడైన యువ ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రెండో సారి ఎంపీగా ఎన్నికైన తరవాత.. అలాంటి దూకుడైన ప్రసంగాలు కనిపించలేదు. ఆమె వ్యక్తిగత జీవితంపై తృణమూల్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.