Puja Khedkar Telugu News: అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం వంటి పలు ఆరోపణల్లో ఇరుక్కున్న ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కేసు మరో మలుపు తిరిగింది. పూణె కలెక్టర్‌ సుహాస్‌ దివాసే తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ పూజా ఖేడ్కర్‌ పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 15, సోమవారం అర్థరాత్రి ఆరుగురు మహిళా పోలీసులు పూజా ఖేడ్కార్  నివాసానికి  రావడం సంచలనం రేపింది. పూజా ఖేడ్కర్ ఫిర్యాదు చేయడంతోనే ఆమె ప్రభుత్వ అతిథి గృహానికి పోలీసులు వెళ్లారు.  "పుణె జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసేపై వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీసు సిబ్బంది సోమవారం వాషిమ్‌లోని ఆమె నివాసంలో ఖేడ్కర్ ను  కలిశారు" అని ఒక అధికారిని పేర్కొన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎందుకు వచ్చారనే విషయాన్ని తెలిపేందుకు ఖేడ్కర్ నిరాకరించారు. నాకు పని ఉన్నందున నేను మహిళా పోలీసులను పిలిచనట్లు ఆమె చెప్పుకొచ్చారు. 


 ట్రైనింగ్ నిలుపుదల 
పూజా ఖేడ్కర్ ఐఏఎస్‌ ప్రొబేషన్‌ను  నిలిపేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలోని జిల్లా ట్రైనింగ్  నుంచి పూజా ఖేడ్కర్‌ని రిలీవ్‌ చేస్తున్నట్లు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఓ ప్రటకనలో తెలిపింది. ఈనెల 23వ తేదీలోగా ఆమె ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ఆకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.  అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలతో పూజా ఖేడ్కర్‌ వార్తల్లోకి ఎక్కారు. అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఇటీవల పుణె నుంచి వాసింకు పూజా ఖేడ్కర్‌ ట్రాన్స్ ఫర్ అయ్యారు. 


తప్పుడు సర్టిఫికెట్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పూజా ఖేడ్కర్ తప్పుడు అఫిడవిట్లు సమర్పించిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో  ప్రస్తుతం వాటి వెరిఫికేషన్ కొనసాగుతోంది. ఆమె పేర్కొన్న దృష్టి లోపానికి సంబంధించిన అంశంపై దర్యాప్తు జరుగుతోంది. పూజా ఖేడ్కర్ గతంలో అహ్మదాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి 2018, 2021 ఇచ్చిన రెండు సర్టిఫికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సమర్పించింది. పెర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసేబిలిటీ (పీడబ్ల్యూబీడీ) కేటగిరి కింద ఈ సర్టిఫికెట్లను యూపీఎస్‌సీ(UPSC)కి ఆమె అందించారు. 2022లో పుణెలోని అనుథ్ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి వికలాంగ సర్టిఫికెట్‌కు దాఖలు చేసుకోగా, వైద్య పరీక్షల అనంతరం ఆమె అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. కాగా పూజా ఖేద్కర్‌కు ప్రైవేట్ ఆసుపత్రి ఏడు శాతం వికలాంగ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది.


నేను నిర్ధోషిని - పూజా ఖేడ్కర్ 
 తనపై వచ్చిన ఆరోపణలపై పూజా ఖేడ్కర్ సోమవారం తొలిసారి స్పందించారు. ప్రస్తుతం తాను ట్రైనింగ్‌లో ఉన్నానని, తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి కామెంట్లు చేయదలుచుకోలేదన్నారు. నిజం తేలే వరకు తనను నిర్ధోషినని పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం మాత్రమే నిజం ఏమిటో అందరికీ తెలుస్తుందన్నారు.  దర్యాప్తు కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పూజా ఖేడ్కర్ ట్రైనింగ్‌ను నిలిపేస్తున్నట్లు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.