Rs 500 Note Fact Check:  నకిలీ నోట్లకు సంబంధించిన వార్తలు తరచూ వెలువడుతూనే ఉన్నాయి.  దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో నకిలీ నోట్లను పట్టుకుంటున్నారన్న వార్తలు వింటూనే ఉన్నాం.  మరి ఈ నకిలీ నోట్లు మన వరకు వస్తే ఏం చేయాలి? మార్కెట్లో ఉన్న నకిలీ రూ.500 నోట్లను ఎలా గుర్తించాలి? ఒరిజినల్ నోట్లకు ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏమిటి ? అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. దొంగ నోట్లు ముద్రించేవారు చిన్న మార్కెట్లనే లక్ష్యంగా చేసుకుని నోట్లను మారుస్తుంటారని సమాచారం. కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు అయితే ఎవరూ గుర్తుపట్టరని వాటిలోకి నకిలీ నోట్లను తీసుకొస్తున్నారట. అందుకే రూ.500 నకిలీ నోట్లను గుర్తించేందుకు వాటి ఫీచర్ల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. 


ఫేక్ రూ.500నోటు
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూ.500 నోటుకు సంబంధించిన ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో రూ.500ల నోటు కనిపిస్తుంది. దీని క్రమ సంఖ్య మధ్యలో స్టార్ గుర్తు (*) ఉంటుంది. ఈ సందర్భంలో పోస్టింగ్ వినియోగదారుడు స్టార్ గుర్తున్న 500రూపాయల నోటును నకిలీదిగా చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో రూ.500 నకిలీ నోట్లు మార్కెట్‌లోకి వచ్చాయని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రజలు ఇలాంటి నోట్లు తీసుకోకుండా ఉండాలని సూచించారు. మీ దగ్గర 500 రూపాయల నోటు ఉండి దాని సీరియల్ నంబర్  మధ్యలో స్టార్‌ గుర్తు ఉంటే అది నకిలీ నోటని అర్థం చేసుకోండి అని ట్వీట్‌ చేశాడు. దీనితో పాటు, ఫోటోను షేర్ చేసిన వ్యక్తి ఈ రోజు అలాంటి 500 నోట్లను స్వీకరించడానికి ‘ఇండస్‌ఇండ్ బ్యాంక్’ నిరాకరించిందని తెలిపారు. తన మెసేజ్ ను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని, తద్వారా ప్రజలు నకిలీ నోట్ల గురించి తెలుసుకునేలా అవగాహన కల్పించాలని  విజ్ఞప్తి చేశాడు. 






అసలు నిజం ఇదే !
తన పోస్ట్‌లో వినియోగదారు తన ఫ్రెండ్ అలాంటి కొన్ని రూ.500 నోట్లను అందుకున్నట్లు రాసుకొచ్చారు. కానీ అతను వాటిని తీసుకోవడానికి నిరాకరించారు.  ప్రస్తుతం మార్కెట్లో  నకిలీ నోట్లను మార్పిడి చేసే హాకర్ల సంఖ్య మార్కెట్లో పెరిగింది. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలని కోరారు. రూ.500 నోటుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ట్వీట్ చేసింది. రూ.500 కరెన్సీ నోటు పై స్టార్‌ (*) గుర్తు ఉంటే అవి నకిలీవంటూ సోషల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పష్టం చేసింది. స్టార్‌ గుర్తు కలిగిన నోట్లు నకిలీవి అని జరుగుతోన్న ప్రచారం తప్పు అని  పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ‘ఎక్స్‌’లో  పేర్కొంది.  


2016 డిసెంబరులో నోట్ల రద్దు తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ అటువంటి నోట్లను విడుదల చేసిందని పీఐబీ తెలిపింది. 500 రూపాయల నోట్లలో స్టార్ గుర్తుతో అప్పట్లో ఆర్‌బీఐ ప్రారంభించిందని తెలిపారు. ఈ తరహా నోట్లు 2016 డిసెంబర్‌ నుంచి మార్కెట్లో చెలామణిలో ఉన్నట్లు స్పష్టం చేసింది.