ABP  WhatsApp

UK PM Liz Truss: దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణలు- ఎందుకంటే?

ABP Desam Updated at: 18 Oct 2022 05:24 PM (IST)
Edited By: Murali Krishna

UK PM Liz Truss: దేశ ప్రజలకు యూకే ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ క్షమాపణలు చెప్పారు.

దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణలు- ఎందుకంటే?

NEXT PREV

UK PM Liz Truss: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఆ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పన్నుల భారం తగ్గించడం వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని ఆమె అన్నారు. పన్నుల భారం తగ్గించడంపై యూటర్న్ తీసుకున్నందుకు ఆమె దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.



జరిగిన తప్పులకు బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మేం మరీ వేగంగా చాలా దూరం పరిగెత్తాం. కానీ దేశానికి సేవ చేయాలనే నా ధృడ సంకల్పం అలానే ఉంది.                                               - లిజ్ ట్రస్, యూకే ప్రధాని


కొంపముంచింది


లిజ్‌ ట్రస్‌ ఇప్పటికే ఓ మినీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అది కాస్తా...దేశ ఆర్థిక వ్యవస్థను ఇంకాస్త కుంగదీసింది. ధనికులకు పన్నుకోతలు విధించటం పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసింది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న క్వాసీ కార్టెంగ్‌ను ఆ పదవి నుంచి తప్పించారు లిజ్‌ ట్రస్. ఈ నిర్ణయంతో ఇంకా వ్యతిరేకత పెరిగింది. ట్రస్ అధికారంలోకి వచ్చినప్పటికీ...ప్రస్తుతం అందరి పార్టీ సభ్యుల అభిప్రాయం మారిపోయింది. "తప్పుడు అభ్యర్థిని ఎంచుకున్నాం" అని వాళ్లు బహిరంగంగా చెప్పకపోయినా...వాళ్ల ఆలోచన అలాగే ఉందని ఓ సర్వేలో తేలింది. దాదాపు 62% మంది ఈ అసహనంతోనే ఉన్నారట. లిజ్ ట్రస్‌ను పక్కన పెట్టి మళ్లీ రిషి సునక్‌ను తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.  


అవిశ్వాసం


అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు లిజ్ ట్రస్‌కు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు. ఈ మేరకు ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టూ సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లేఖలు సిద్ధం చేసుకున్నారు. కన్జర్వేట్ పార్టీ కమిటీ హెడ్‌ గ్రహమ్ బ్రాడీకి ఈ లెటర్స్ సమర్పించనున్నారు. అక్టోబర్ 24వ తేదీ లోపు ఆమెను తప్పిస్తారన్న వార్తలూ జోరుగానే వినిపిస్తున్నాయి. లిజ్‌ ట్రస్‌ సమయం ముగిసిపోయిందని, అవిశ్వాస తీర్మానానికి వీలైనంత త్వరగా ఓటింగ్‌ నిర్వహించేందుకు వీలుగా నిబంధనలు మార్చేలా ఆదేశాలివ్వాలని ఎంపీలు కోరనున్నట్లు తెలుస్తోంది. వీళ్ల విజ్ఞప్తిని విన్న గ్రహమ్ బ్రాడీ... తిరస్కరించినట్టు సమాచారం. అంతే కాదు. దేశాన్ని ఆర్థికంగా ఆమెను ముందు నడిపించలేరనీ విమర్శిస్తున్నారు ఆ ఎంపీలు. 2016లో ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు ముగ్గురు ప్రధాన మంత్రులు ఇలా మధ్యలోనే పదవిలో నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు లిజ్ ట్రస్ సమయం ఆసన్నమైందని చాలా గట్టిగానే చెబుతున్నారు...ఆమెకు వ్యతిరేకంగా ఉన్న ఎంపీలు. నిజానికి అక్టోబర్ 31వ తేదీన కొత్త ఆర్థిక వ్యూహాలు ప్రకటించాల్సి ఉంది. ప్రధాని లిజ్‌ట్రస్‌తో పాటు, ఛాన్స్‌లర్ జెరెమీ హంట్‌...ఈ వ్యూహాలను ప్రకటిస్తారు. 


ఉత్కంఠ పోరులో గెలిచి


ఎంతో ఉత్కంఠగా సాగిన యూకే ప్రధాని రేసులో లిజ్ ట్రస్ విజయం సాధించారు. మొదటి నుంచి రిషి సునక్ కన్నా లీడ్‌లో ఉన్న లిజ్..ఫైనల్ కౌంట్‌డౌన్‌లోనూ ముందంజలో నిలిచారు. యూకే ప్రధాని అయ్యాక లిజ్ ట్రస్ ప్రసంగించారు. పన్నులను తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన ప్లాన్‌ సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. నేషనల్ హెల్త్ సర్వీస్‌లోని సమస్యల్నీ పరిష్కరిస్తానని వెల్లడించారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఘన విజయం సాధించి పెడతానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి ఎన్నో రోజులు కాకముందే...ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతుండటం యూకే రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్నాయన్న సంకేతాలిస్తోంది. 


Also Read: Russian Fighter Plane: భవనంలోకి దూసుకెళ్లిన ఫైటర్ జెట్- మంటలు చెలరేగి 13 మంది మృతి!

Published at: 18 Oct 2022 05:20 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.