US Visas:


ఎంబసీలోనే అపాయింట్‌మెంట్‌..


అమెరికా వీసా రావాలంటే నెలల పాటు వేచి చూడాల్సిందే. అగ్రరాజ్యానికి వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తోంది ఈ ప్రాసెస్. ఇంటర్వ్యూ పూర్తై వీసా చేతికి రావాలంటే ఎన్నో సవాళ్లు దాటుకోవాల్సి వస్తోంది. అపాయింట్‌మెంట్ పీరియడ్ దాదాపు 500 రోజుల వరకూ ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఓ కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లెవరైనా యూఎస్ ఎంబసీలో లేదా కాన్సులేట్‌లో నేరుగా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని వెల్లడించింది. థాయ్‌లాండ్‌కు వెళ్లాలనుకునే వారికి అపాయింట్‌మెంట్‌లు ఇస్తున్నట్టు చెప్పింది.  


"మీరు విదేశానికి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీ దగ్గర ఉన్న యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్‌కు వెళ్లి నేరుగా వీసా అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. థాయ్‌లాండ్‌కు వెళ్లాలనుకునే వాళ్లు Travel&Business B1/B2 వీసాల అపాయింట్‌మెంట్‌
అక్కడే తీసుకోవచ్చు" 


యూఎస్ ఎంబసీ, ఇండియా 






స్పెషల్ ఇంటర్వ్యూలు


వీసా జారీ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు అమెరికా ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తొలిసారి వీసా అప్లై చేస్తున్న వారికి స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు కాన్సులేట్‌లో సిబ్బందిని పెంచడం లాంటి చర్యలు చేపడుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్‌లలోని యూఎస్ ఎంబసీల్లో  ఈ ఏడాది జనవరి 21న శనివారం రోజున "స్పెషల్ ఇంటర్వ్యూలు"
ఏర్పాటు చేశారు. కొంత మంది ఎంబసీకి వచ్చే వీల్లేకుండా రిమోట్‌ విధానంలో అప్లికేషన్లు తీసుకుంటోంది. రెండు వారాల క్రితమే రెండున్నర లక్షల B1/B2 అపాయింట్‌మెంట్స్‌ జారీ చేసింది అమెరికా. వీసా అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నట్టు యూఎస్ వీసా అధికారులు చెబుతున్నారు.  


అమెరికా వెళ్లాలని కలగనే వారికి ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీసాల ఛార్జీలను భారీగా పెంచేసింది. H-1B వీసాలతో పాటు మరి కొన్ని వీసాలపైనా 200%కిపైగా ఛార్జీలు పెంచుతూనిర్ణయం తీసుకుంది బైడెన్ ప్రభుత్వం. H-1B ప్రీ రిజిస్ట్రేషన్‌ ఫీజులు 10 డాలర్ల నుంచి ఏకంగా 215డాలర్లకు పెరిగింది. H-1 వీసాలపై 460 డాలర్లుగా ఉన్న ఫీజ్‌ని 780 డాలర్లకు పెంచింది అమెరికా. ఇక L వీసాల రుసుమునీ 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచింది. ఇతరత్రా స్కిల్ బేస్డ్‌ ఉద్యోగాలు చేసే వారికి ఇచ్చే  O కేటగిరీ వీసాలపైనా 129% మేర ఫీజ్ పెంచేసేంది
బైడెన్ యంత్రాంగం. ఇన్వెస్టర్‌లు,బడా వ్యాపారవేత్తలకు ఇచ్చే EB-5 వీసాలు (మిలియనీర్ వీసాలు) కూడా ప్రియం కానున్నాయి. ప్రస్తుతం వీటి ఫీజు 3,675 డాలర్లుగా ఉంది. ఇప్పుడీ రుసుము 11,160 డాలర్లకు పెరిగింది. అంటే..దాదాపు 204% మేర పెంచేసింది. ప్రీమియమ్ ప్రాసెసింగ్‌ ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. పైగా..కొన్ని ఛార్జీలను తగ్గించాలని చూస్తోంది అమెరికా. ఫెడరల్ రిజిస్టర్‌లో ఈ కొత్త ఫీజులను పబ్లిష్ చేశారు. హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం ఈ వివరాలు వెల్లడించింది. కార్యకలాపాలు కొనసాగించాలంటే...నిర్వహణ ఖర్చులు భరించాలంటే...ఈ మాత్రం ఫీజు పెంచక తప్పదని తేల్చి చెప్పింది.