టిబెటియన్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 14వ దలైలామాను టెంజిన్ గ్యాస్టోగానూ పిలుస్తారు. అహింసకు, కరుణకు ఆయనను ప్రతీకగా భావిస్తారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని
ఆకాంక్షించారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా దలైలామాకు ట్విటర్‌లో విషెస్ చెప్పారు. హాలీవుడ్ యాక్టర్ రిచర్డ్ గీర్ ధర్మశాలలో నిర్వహించిన దలైలామా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. దలైలామాతో కలిసి కేక్ కట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.
దలైలామా జీవిత విశేషాలు:
టిబెట్‌లోని అమ్‌డో ప్రావిన్స్‌లో 1935, జులై 6వ తేదీన జన్మించారు దలైలామా. ఆయనకు లామో థాండప్ అనే పేరు పెట్టారు. కోరికలు తీర్చే దేవత అని దీనర్థం. 1959లో చైనా ప్రభుత్వం అరాచకాలతో వేలాది మంది టిబెటియన్లు తమ ప్రాంతాన్నీ వీడాల్సి వచ్చింది. వారంతా భారత్‌కు వలస వచ్చారు. దలైలామా కూడా వారిలో ఉన్నారు. ముస్సోరి, ఉత్తరాఖండ్‌లో కొంతకాలం పాటు ఉన్నారు. 1960లో ధర్మశాలకు వెళ్లిపోయారు. ఆయనను అందరూ ఆధ్యాత్మికవేత్తగా పిలుస్తుంటే, చైనా మాత్రం "వేర్పాటువాది" అని ముద్ర వేసింది. "సన్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తోంది. అంతకు ముందు వారితో పోల్చితే ఎక్కువ కాలం పాటు జీవించిన దలైలామాగా ఆయన రికార్డు సృష్టించారు. 1989లో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్నారు.