RSS Vs BJP: ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ దూకుడుకి కాస్త కళ్లెం వేశాయి. 400 భారీ లక్ష్యం పెట్టుకున్నా 293 స్థానాలకే పరిమితమైంది. సొంతగా బీజేపీ 241 సీట్లు గెలుచుకుంది. యూపీలో ఇండీ కూటమి భారీ ఎత్తున సీట్లు సాధించుకుంది. అయితే...అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్‌లోనే బీజేపీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ మందిర నిర్మాణ కలను సాకారం చేసినందుకు ఓటర్లు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారనుకుంటే సీన్ రివర్స్ అయింది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు. ఈ ఓటమిపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకుంటున్న సమయంలోనే RSS మెంటార్ ఇంద్రేశ్ కుమార్ (Indresh Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చురకలు అంటించారు. గర్వమే ఆ పార్టీని ఓడించిందని తేల్చి చెప్పారు. ఆ రాముడే వాళ్ల గర్వాన్ని అణిచివేసేందుకు 241 దగ్గరే బీజేపీని ఆపేశారని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి విమర్శించారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇంద్రేశ్ కుమార్. రామ భక్తులు కాకపోయినా ప్రతిపక్షాలే గెలిచాయని, దేవుడి తీర్పు సరైనదే అని సమర్థించారు. 


"రామ భక్తులమని చెప్పుకున్న వాళ్లు క్రమంగా గర్వం తలకెక్కించుకున్నారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఈ గర్వం వల్లే అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. ఆ రాముడే వాళ్లని 241 దగ్గర ఆపేశాడు. అసలు రాముడిపై విశ్వాసమే లేని వాళ్లు మాత్రం కలిసికట్టుగా 234 స్థానాల్లో విజయం సాధించారు. దేవుడు ఇచ్చిన ఈ తీర్పు సరైనదే"


- ఇంద్రేశ్ కుమార్, RSS నేత 


అయితే ప్రతిపక్షాల పేరుని ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు ఇంద్రేశ్ కుమార్. అంతకు ముందు RSS చీఫ్‌ మోహన్ భగవత్ కూడా పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. నిజమైన ప్రజా సేవకులు ఎవరూ తాము ఇది చేశామని గొప్పగా చెప్పుకోరని అన్నారు. గర్వం తలకెక్కిన వాళ్లను సేవకులుగా పిలవలేమని తేల్చి చెప్పారు.