India Canada Tensions: G7 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలో వీళ్లిద్దరూ సమావేశమవడం కీలకంగా మారింది. పైగా ఈ భేటీపై ట్రూడ్ చేసిన వ్యాఖ్యలూ ఆసక్తి కలిగిస్తున్నాయి. గొడవలన్నీ పక్కన పెట్టి ఇకపై కలిసి ముందడుగేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగానే చెప్పారు. భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని వెల్లడించారు. "కొన్ని కీలక అంశాలపై కలిసి పని చేస్తాం" అని స్పష్టం చేశారు. అయితే...ఈ భేటీలో ఏమేం మాట్లాడుకున్నారన్న దానిపై మాత్రం ట్రూడో వివరాలు వెల్లడించలేదు. భవిష్యత్‌లో భారత్‌తో కచ్చితంగా కలిసి పని చేస్తామన్న సంకేతాలిచ్చారు. 


"మా మధ్య ఏం చర్చ జరిగిందనేదని నేను మరీ లోతుగా ఏమీ చెప్పలేను. కొన్ని కీలక అంశాలు మాత్రం చర్చించాం. వాటిపై ఇంకా సంప్రదింపులు జరగాల్సిన అవసరముంది. కానీ కలిసి పని చేసేందుకు మాత్రం మేం ఎప్పటికీ కట్టుబడే ఉన్నాం. భవిష్యత్‌లో భారత్‌తో కలిసి కొన్ని కీలక అంశాలపై కలిసి పని చేస్తాం. అది మాత్రం చెప్పగలను"


- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాన మంత్రి




గతేడాది జూన్‌లో కెనడాలో ఖలిస్థాన్‌ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ దారుణ హత్యకు గురయ్యాడు. గురుద్వారకి వెళ్లి వస్తుండగా కొందరు ఆయనను అడ్డగించి కాల్పులు జరిపారు. కార్‌లో ఉండగానే దాడి చేశారు. ఈ దాడిలో నిజ్జర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యలో భారత్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు ట్రూడో. దీనిపై భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. నిరాధార ఆరోపణలు చేయొద్దని మందలించింది. ఈ కేసుతో ఇప్పటికే ముగ్గురు భారతీయుల్ని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విభేదాలు వచ్చిన తరవాత మోదీ, ట్రూడో కలుసుకోవడం ఇది రెండోసారి. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన G20 సదస్సుకీ హాజరయ్యారు ట్రూడో. నిజ్జర్ హత్య  కేసులో అరెస్ట్‌ అయిన ముగ్గురినీ విచారిస్తున్నారు. అవసరమైతే తామూ ఈ విచారణకు సహకరిస్తామని భారత్ స్పష్టం చేసింది.