Ayodhya Ram Mandir Opening: ఒక్క భారత్‌లోనే కాదు. అయోధ్య ఉత్సవ సందడి ప్రపంచమంతటా కనిపిస్తోంది. విదేశీయులూ రామ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. NRIలు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్ని అందంగా అలంకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఏకమై ఈ వేడుకలు చేసుకుంటన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలో దాదాపు 300 చోట్ల ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్‌లోని Times Squareతో పాటు మిగతా చోట్ల కూడా లైవ్ టెలికాస్ట్‌కి ఏర్పాట్లు చేశారు. అటు పారిస్‌లోనూ ఈఫిల్‌ టవర్‌ కూడా అయోధ్య ఉత్సవానికి సిద్ధమవుతోంది. అమెరికాలో భారీ ఎత్తున ఆటో ర్యాలీలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో అయితే ఏకంగా రథయాత్ర చేపట్టనున్నారు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్ దేశాల్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. మారిషస్‌లో దాదాపు 48% మంది హిందువులే. అందుకే ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉద్యోగులందరికీ రెండున్నర గంటల పాటు బ్రేక్ ఇచ్చారు. మారిషస్‌లో అన్ని ఆలయాల్లోనూ దీపాలు వెలిగించనున్నారు. రామాయణ శ్లోకాలు పఠించనున్నారు.  Mauritius Sanatan Dharma Temples Federation తరపున అక్కడ ప్రత్యేక పూజలు జరగనున్నాయి. హిందువులంతా స్థానికంగా జరిగే ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ కోరారు. మకర సంక్రాంతి రోజు నుంచే ఇక్కడ అన్ని ఆలయాల్లో రామాయణ పఠనం కొనసాగుతోంది. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దీపావళిలానే జరుపుకుంటామని స్థానిక హిందువులు చెబుతున్నారు. 






భారీ స్క్రీన్స్..


అమెరికాలో టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా సహా మొత్తం 10 రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. విశ్వహిందూ పరిషత్ ఈ ఏర్పాట్లను పరిశీలిస్తోంది. రాములవారి ప్రతిమలతో దాదాపు 350 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూజెర్సీలో హిందువులు ఈ మేరకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో టెస్లా కార్‌ల మ్యూజికల్ షో ఆకట్టుకుంది. ఫ్రాన్స్‌లో రేపు (జనవరి 22న) మధ్యాహ్నం 12 గంటలకు రథయాత్ర చేపట్టనున్నారు. ఆ తరవాత గణేషుని ఆలయంలో విశ్వకల్యాణ యజ్ఞం జరగనుంది. అటు కెనడా కూడా భారీ వేడుకలకు సిద్ధమవుతోంది. అక్కడి టౌన్స్‌ జనవరి 22ని అయోధ్య రామ మందిర దినోత్సవంగా ప్రకటించాయి. న్యూజిలాండ్‌లోనూ ఇదే స్థాయిలో ఉత్సాహం కనిపిస్తోంది. హౌస్టన్‌లో సుందరాకాండ పారాయణం చేయనున్నారు. దీంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ తరవాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసి అందరికీ ప్రసాద వితరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొంతమంది పాకిస్థానీలూ ఈ వేడుకల్లో పాల్గొంటుండటం విశేషం. అమెరికాలోని దాదాపు వెయ్యి ఆలయాల్లో ఆ రోజున రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి.


Also Read: Ram Mandir: రామసేతు ప్రారంభమైన చోట ప్రధాని ప్రత్యేక పూజలు, ధనుష్‌కొడిలో కాసేపు గడిపిన మోదీ