Budget 2025 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం తప్పక నింపుతుందని భరోసా ఇచ్చారు. ఈ సెషన్‌లో చారిత్రక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ బడ్జెట్ దేశానికి కొత్త శక్తిని, ఆశను పెంపొందిస్తుందన్నారు.

అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్ లో ముందుకెళ్తున్నాం మోదీ

"పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కరుణ ఎప్పుడూ ఉండాలి.  దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్మీ ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు. పార్లమెంట్ లో మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది. భారత్ అభివృద్ధి లక్ష్యంలో మిషన్ మోడ్ లో దూసుకెళ్తున్నాం. ఈ సారి పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నాం. కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్నోవేషన్, ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. ఈ బడ్జెట్ వృద్ధికి ఊతమిస్తుంది. ఈ సెషన్ యువతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుంది. ప్రతి సెషన్‌కి ముందు కొన్ని విదేశీ శక్తుల జోక్యం ఉండేది. పదేళ్ల కాలంలో ఈ సారే అది కనిపించలేదు. పార్లమెంటులో ప్రతి అంశంపైనా సమగ్ర చర్చ జరగాలి. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాను" అని ప్రధాని మోదీ చెప్పారు. ఇకపోతే నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంపీలతా పార్లమెంట్ కు చేరుకున్నారు.

పన్ను స్లాబ్‌ల పెంపుపై ఆశాభావం

చాలా మంది వేతన తరగతికి పన్ను స్లాబ్‌ల పెంపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, దానికి సంబంధించి సమాచారంపై ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు. నిజానికి, భారతదేశంలోని ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ వసూళ్లలో సింహభాగం మధ్యతరగతి ప్రజలదే కావడం గమనార్హం. మోదీ హయాంలో దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్‌లు) సంఖ్య 2013-14లో 3.35 కోట్ల నుంచి 2023-24 నాటికి 7.54 కోట్లకు పెరిగింది. అయితే జీరో ఐటీఆర్‌ల సంఖ్య 1.69 కోట్ల నుంచి 4.73 కోట్లకు రెండింతలు పెరిగింది. 

బడ్జెట్ సమావేశాలు 2024 -25

ఈ సారి బడ్జెట్ సమావేశాలు 2024 -25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఆమె కేంద్ర బడ్జెట్ ను సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా శుక్రవారి నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. అందులో తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుండడం వరుసగా ఇది 8వ సారి కావడం చెప్పుకోదగ్గ విషయం.

Also Read : Delhi Weather : 6 ఏళ్ల రికార్డ్ బద్దలు - ఢిల్లీలో చలి తట్టుకోలేక 56 రోజుల్లోనే 474 మంది మృతి - సర్కారుకు నోటీసులు