TVK Thiruthani candidate: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీలో టికెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. తిరుత్తణి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడిన అడ్వకేట్ సత్యకుమార్ తీరుపై స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆయనతో ప్రచారానికి వెళ్లడంలేదు.
నేతల సామూహిక బహిష్కరణ
తిరుత్తణి నియోజకవర్గ టీవీకే అభ్యర్థి సత్యకుమార్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కార్యదర్శితో సహా నగర, మండల స్థాయి నాయకులందరూ ప్రచారాన్ని బహిష్కరించారు. విజయ్ పార్టీ తరపున బరిలోకి దిగిన సత్యకుమార్, నామినేషన్ వేసే సమయంలో పార్టీ నేతలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఒంటరిగా వెళ్లి పత్రాలు సమర్పించడం స్థానిక కేడర్‌కు ఆగ్రహం తెప్పించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన అభ్యర్థి తమకు వద్దంటూ వందలాది మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
వివాదాస్పద వ్యాఖ్యలు - కరువైన మద్దతు
సత్యకుమార్ గతంలో తిరుత్తణి యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయి. ఇక్కడి యువత అంతా గంజాయి బ్యా అని, వారికి కనీసం చదవడం, రాయడం కూడా రాదని ఆయన కించ పరిచేలా మాట్లాడారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతాన్ని, యువతను అవమానించిన వ్యక్తికి తాము ఓట్లు ఎలా అడుగుతామని వారు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని తక్షణమే మార్చకపోతే తాము ఎన్నికల పనులకు దూరంగా ఉంటామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.
ఒంటరి పోరాటం - సోషల్ మీడియాలో వైరల్
పార్టీ శ్రేణుల మద్దతు కరువవ్వడంతో సత్యకుమార్ గత్యంతరం లేక తిరుత్తణి రోడ్లపై ఒంటరిగా ప్రచారం మొదలుపెట్టారు. చేతిలో పార్టీ జెండా పట్టుకుని, దారిలో వెళ్లే వాహనదారులను, వ్యాపారులను ఆపి తనకు ఓటు వేయాలని అర్థించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకప్పుడు విజయ్ పార్టీ అభ్యర్థి అంటే భారీ ఊరేగింపులు ఉంటాయని ఆశించిన జనానికి, అభ్యర్థి ఇలా ఒంటరిగా రోడ్డుపై నిలబడి ఉండటం కనిపిస్తోంది.
విజయ్ నిర్ణయంపై ఉత్కంఠ
పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనే ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటం టీవీకే వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఇతర నియోజకవర్గాల్లో విజయ్ క్రేజ్‌తో పార్టీ దూసుకుపోతుంటే, తిరుత్తణిలో మాత్రం పరిస్థితి రివర్స్ అయ్యింది. మరి ఈ నిరసనలతో విజయ్ తన అభ్యర్థిని మారుస్తారా? లేక సత్యకుమార్‌తోనే ముందుకు వెళ్తారా? అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
