Thief Leaves Apology Note: తమిళనాడులో ఓ వింత ఘటన జరిగింది. ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగ అదే ఇంట్లో ఓ నోట్ రాసి పెట్టి వెళ్లిపోయాడు. "దయచేసి క్షమించండి" అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అంతే కాదు. నెల రోజుల్లోగా చోరీ చేసిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. మెగ్‌ననపురంలోని సత్తంకులంలో ఇది జరిగింది. రిటైర్డ్ టీచర్ అయిన సెల్విన్ జూన్ 17న చెన్నైలోని కొడుకుని చూసేందుకు వెళ్లారు. ఇంట్లో పని కోసం ఓ వ్యక్తిని పెట్టుకున్నారు. ఇంటి బాధ్యత అంతా అప్పగించి చెన్నై వెళ్లిపోయారు. జూన్ 26న తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు తీసి ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు యజమానులు. పని మనిషి గురించి ఆరా తీశారు. ఎక్కడా కనిపించకపోవడం వల్ల అతడే చోరీ చేశాడని తెలుసుకున్నారు. రూ.60 వేలతో పాటు 12 గ్రాముల బంగారం, వెండి పట్టీలు చోరీ చేశాడు నిందితుడు. పోలీసులు వచ్చి ఇల్లంతా సోదా చేయగా అక్కడే ఓ నోట్ కనిపించింది. "చోరీ చేశానని కోపం తెచ్చుకోవద్దు. దయచేసి నన్ను క్షమించండి. నెల రోజుల్లో అంతా తిరిగి ఇచ్చేస్తాను. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అందుకే ఈ దొంగతనం చేయాల్సి వస్తోంది" అని అందులో రాసుంది. ఇది చూసి పోలీసులతో పాటు యజమానులూ అవాక్కయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గతంలోనూ కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. పాలక్కడ్‌లో ఓ దొంగ మూడేళ్ల చిన్నారి బంగారు గొలుసుని చోరీ చేశాడు. తరవాత ఆ గొలుసు అమ్మేసి, ఆ డబ్బుని తిరిగి ఇచ్చాడు. క్షమించమంటూ ఓ లెటర్ కూడా రాశాడు.
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్ వదిలి వెళ్లిన దొంగ
Ram Manohar
Updated at:
04 Jul 2024 01:06 PM (IST)
Tamil Nadu: తమిళనాడులో ఓ దొంగ ఓ ఇంట్లో చోరీ చేసి అక్కడే ఓ నోట్ వదిలి వెళ్లాడు. తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వస్తోందని నెల రోజుల్లో ఇచ్చేస్తానని లెటర్ రాశాడు.
తమిళనాడులో ఓ దొంగ ఓ ఇంట్లో చోరీ చేసి అక్కడే ఓ నోట్ వదిలి వెళ్లాడు. తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వస్తోందని నెల రోజుల్లో ఇచ్చేస్తానని లెటర్ రాశాడు.