Kapil Sibal on Amith Shah: 


విచారణకు డిమాండ్..


రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలే లేకుండా కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లు కచ్చితంగా వస్తాయని అమిత్‌ షా ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఎన్ని సీట్లు వస్తాయన్నది ఓ బీజేపీ నేతకు ఎలా తెలుస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. 


"నేను ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. ప్రతిపక్షాలు అనేవే లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాకు 300 కి పైగా సీట్లు వస్తాయని అంత బహిరంగంగా చెబుతున్నారు. బీజేపీ మంత్రే సీట్ల విషయాన్ని ఇంత బాహాటంగా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికలు జరగకముందే ఎన్ని సీట్లు వస్తాయో జోష్యం చెబుతున్నారు. ఎన్నికల సంఘంతో పాటు కోర్టులు కూడా ఈ వ్యాఖ్యలపై జోక్యం చేసుకోవాలి"


- కపిల్ సిబాల్, రాజ్యసభ ఎంపీ 






రాహుల్ గాంధీపై అనర్హతా వేటు పడినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కీలక లీడర్‌లు స్పందిస్తున్నారు. రాహుల్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను కావాలనే అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ పోరాటానికీ సిద్ధమయ్యారు. పైకోర్టులో తేల్చుకుంటామని తేల్చి చెబుతోంది. విపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సమావేశం ముగిసిన తరవాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదో చరిత్రాత్మక భేటీ అని, ఎన్నో సమస్యలపై చర్చ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఒక్కటిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. 


"ఇవాళ చరిత్రాత్మక సమావేశం జరిగింది. చాలా సమస్యలు చర్చించాం. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి, కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 


Also Read: విపక్షాలను ఏకం చేసేందుకు స్పీడ్ పెంచిన నితీష్‌ కుమార్- త్వరలో కేసీఆర్‌, మమతతో భేటీ!