Twitter Employee Layoff:
ఉద్యోగులకు షాక్..?
ట్విటర్‌కు అధికారికంగా "బాస్" అయ్యారు ఎలన్ మస్క్. దాదాపు నాలుగైదు నెలల పాటు ఈ డీల్ ఎన్నో మలుపులు తిరిగి చివరకు మస్క్ హస్తగతమైంది. కంపెనీని సొంతం చేసుకున్న మస్క్...ఇప్పుడు తన స్టైల్‌లో అందులో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ట్విటర్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన...ట్విటర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. భారీ ఎత్తున "లే ఆఫ్‌లు"ఉండొచ్చన్న సంకేతాలిస్తున్నారు. డీల్ పూర్తైన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని మస్క్ ముందుగానే అనుకున్నారట. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత వరకూ మ్యాన్ పవర్‌ను తగ్గించే పనిలో పడ్డారట. అంతే కాదు. కంపెనీలో ఇంకెన్నో మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు మస్క్. విధానాల్లో మార్పులు లేకపోయినా...వాటిలో సంస్కరణలు చేపట్టాలని చూస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న వారిని తొలగించిన తరవాతే ఈ ప్రక్షాళన మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే..కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్‌ను తొలగించారు మస్క్. తరవాత ఆయన "Content Moderation Policy"పై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ట్విటర్ వేదికగా మస్క్ ఓ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా Content Moderation Councilని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. Restricted Accountsకి సంబంధించి తుది నిర్ణయమూ తీసుకుంటారు.
లేఆఫ్‌లు నిజమేనా..?
నిజానికి...ట్విటర్‌లో భారీ లేఆఫ్స్ ఉండనున్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ కంపెనీ మస్క్ హస్తగతమయ్యాక...దీనిపై స్పష్టత వచ్చింది. మొత్తం ట్విటర్‌లో 7,500 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 75% మందిని తొలగించాలని చూస్తున్నారట. అంత భారీ మొత్తంలో ఉద్యోగాల కోత ఏమీ ఉండదని ట్విటర్ అంతర్గత వర్గాలు చెబుతున్నా...ఉద్యోగుల్లో ఆ భయం మాత్రం పోవటం లేదు. ఓ ఉన్నతాధికారి దీనిపై స్పందించి ఉద్యోగులకు మెయిల్ కూడా పంపారు. ఆ స్థాయిలో లేఆఫ్‌లు ఉండవని తేల్చి చెప్పారు.
మస్క్ బాస్..
శుక్రవారం కల్లా ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానన్న మస్క్, దీనికి ఒక రోజు ముందు శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. మామూలుగా వెళ్తే మస్క్ ఎందుకవుతాడు?. ఒక సింక్‌ను చేత బట్టుకుని మరీ ఆఫీసులో అడుగు పెట్టారాయన. పైగా... సింక్‌ను మోస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లాబీలో తిరుగుతున్న వీడియోను పోస్ట్ చేశారు. "Entering Twitter HQ – let that sink in!" అన్న క్యాప్షన్‌తో ఆ వీడియోను ట్వీట్ చేశారు. తనను తాను "చీఫ్ ట్విట్" (Chief Twit) అని పేర్కొంటూ తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను మస్క్ మార్చారు. అంతేకాదు, తన లొకేషన్‌ను ట్విట్టర్ ప్రధాన కార్యాలయంగా ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్విటర్ షేర్ ధర కూడా మస్క్ కొనుగోలు చేయాలనుకున్న ధర అయిన 54.20 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఈ విషయంలోనూ ఇబ్బంది లేదు కాబట్టి మస్క్ మళ్లీ మెలిక పెట్టరనే బిజినెస్ కమ్యూనిటీ భావిస్తోంది.
Also Read: Kangana Ranaut: పొలిటికల్ ఎంట్రీపై కంగనా హాట్ కామెంట్స్- సై అంటే సై!