New Parliament Opening:
సుప్రీంకోర్టుకి చేరిన వివాదం..
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు ముదిరాయి. అన్ని పార్టీలనూ ఆహ్వానించామని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు విపక్షాలు ఆసక్తి చూపించడం లేదు. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొత్త పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతికి తగిన గౌరవం కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ విలువల్ని కించపరిచారని ఆరోపించారు. లాయర్ జయసుకీన్ ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే 19 పార్టీలు తాము హాజరు కావడం లేదని లెటర్ రాశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మాత్రమే పార్లమెంట్‌ని ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశాయి. కానీ...బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడుతోంది.
ఒక్కటైన విపక్షాలు..
ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఈ అంశంలో ఒక్కటయ్యాయి. మహారాష్ట్ర ఉద్ధవ్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ తమ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పారు. ఈ విషయంలో విపక్షాలతోనే కలిసి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. పార్లమెంట్ అధినేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పక్కన పెట్టి...మోదీ స్వయంగా ప్రారంభించడాన్ని తప్పు పట్టారు. అయితే...ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు అంగీకరించింది. బైకాట్ చేసిన పార్టీల లిస్ట్‌లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ...ఆ పార్టీ నేత ఆచార్య ప్రమోద్ మాత్రం పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్లమెంట్‌ని భారత ప్రధాని కాకపోతే..పాకిస్థాన్ ప్రధాని వచ్చి ప్రారంభిస్తారా అంటూ సెటైర్లు వేశారు.
"కొత్త పార్లమెంట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ కాకపోతే..పాకిస్థాన్ ప్రధాని వచ్చి ప్రారంభిస్తారా..? మోదీని వ్యతిరేకించే హక్కు మనకు ఉండొచ్చు. కానీ..దేశాన్ని వ్యతిరేకించే హక్కు మాత్రం లేదు. ప్రతిపక్షాలన్నీ పునరాలోచించుకోవాలి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి"
- ఆచార్య ప్రమోద్, కాంగ్రెస్ నేత