బీఆర్‌ఎస్‌నేత, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. తీసుకున్న 20 కోట్లు వడ్డీ 25 కోట్లు మొత్తం 45 కోట్లు చెల్లించాలని తెలియజేశారు. 
మూడు రోజుల క్రితమే జీవన్‌ రెడ్డి భార్య ఎండీగా ఉన్న మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు నోటీసులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు షాక్‌లు ఆయనకు తగిలాయి. 2017లో స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ నుంచి జీవన్‌ రెడ్డి తన భార్య పేరిట 20 కోట్లు అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి చెల్లింపులు చేయలేదు. దీంతో అది వడ్డీతో కలుపుకొని 45 కోట్లకు చేరింది. ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నందున ఆయన్ని ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 45 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. 


ఆర్మూర్‌ పట్టణంలో ఆర్టీసీ స్థలంలో జీవన్‌ రెడ్డికి చెందిన మాల్ ఉంది. ఈ ఐదు అంతస్తుల మాల్‌కు సంబంధించిన బకాయిలు కూడా ఎప్పటి నుంచో ఆయన చెల్లించడం లేదు. ప్రభుత్వం మారిన వెంటనే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన ఏడు కోట్లకుపైగా బకాయిలు, ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన రెండున్నర కోట్ల బకాయిలు మూడు రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆ బిల్డింగ్‌కు విద్యుత్‌ కూడా నిలిపేశారు. 
ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లు ఒకేసారి జీవన్‌రెడ్డిపై పడటంతో జిల్లా అంతటా దీనిపైనే చర్చించుకుంటున్నారు. భవిష్యత్‌లో ఏం జరగబోతోందో అన్న చర్చ నడుస్తోంది.