Telangana Dail 112 :    తెలంగాణలో  112  అనే ఏకీకృత అత్యవసర సేవల నంబర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS) * కింద అమలులోకి తీసుకొచ్చారు. ఈ నంబర్ ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళలు , పిల్లల భద్రత, విపత్తు సహాయం వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే చోట పొందవచ్చు. ఈ సేవలు గతంలో 100 (పోలీసు), 101 (ఫైర్), 108 (అంబులెన్స్), 1091 (మహిళల హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) వంటి విభిన్న నంబర్ల ద్వారా అందుబాటులో ఉండేవి, కానీ ఇప్పుడు 112 ఒకే నంబర్‌ ద్వారా అన్నీ లభిస్తున్నాయి. 


 112 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా పోలీసు, ఫైర్, అంబులెన్స్, మహిళలు, పిల్లల భద్రత, విపత్తు నిర్వహణ సేవలు అందుబాటులో ఉంటాయి.  ఈ నంబర్ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నుండి 24x7 పనిచేస్తుంది.  కాల్ చేసిన వెంటనే GPS ద్వారా కాలర్ యొక్క లొకేషన్ ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తారు. దీనివల్ల సమీపంలోని పోలీసు వాహనం, అంబులెన్స్ లేదా  అగ్నిమాపక వాహనం  త్వరగా సంఘటన స్థలానికి చేరుకుంటుంది. 


 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌లో పవర్ బటన్‌ను మూడు సార్లు వేగంగా నొక్కితే 112కి పానిక్ కాల్ యాక్టివేట్ అవుతుంది. సాధారణ ఫోన్‌లలో 5 లేదా 9 కీని ఎక్కువసేపు నొక్కి ఉంచడం ద్వారా పానిక్ కాల్ చేయవచ్చు. 112 ఇండియా మొబైల్ యాప్ కూడా అందుబాటులో ుంది.    గూగుల్ ప్లే స్టోర్,  యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న  112 India  యాప్ ద్వారా అత్యవసర సేవలను పొందవచ్చు.


మహిళలు మరియు పిల్లల కోసం ఈ యాప్‌లో ప్రత్యేక "SHOUT" ఫీచర్ ఉంది, ఇది సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లకు అలర్ట్ పంపి తక్షణ సహాయం అందిస్తుంది.  112కి SMS పంపడం ద్వారా అత్యవసర సహాయం కోరవచ్చు. dial112@gov.in కు ఇమెయిల్ ద్వారా సహాయం కోరవచ్చు. ERSS వెబ్‌సైట్ (112.gov.in) ద్వారా SOS అలర్ట్ లేదా ఇమెయిల్ పంపవచ్చు.  



 కాల్ చేసిన వ్యక్తి హిందీ, ఇంగ్లీష్ లేదా స్థానిక భాషలలో  మాట్లాడవచ్చు.  తెలంగాణలో తెలుగు,  ఇతర స్థానిక భాషలలో సేవలు అందుబాటులో ఉన్నాయి.  ప్రభుత్వం 10-12 నిమిషాలలో స్పందన సమయం లక్ష్యంగా పెట్టుకుంది, దీనిని రాబోయే 6-8 నెలల్లో 8 నిమిషాలకు తగ్గించాలని  ప్రయత్నిస్తోంది.  తెలంగాణలో 112 నంబర్ అధికారికంగా  పూర్తిగా అమలులోకి వచ్చింది. జూన్ 14, 2025న ఒకే రోజులో నాలుగు ప్రధాన నేరాలను నిరోధించడంలో 112 సేవలు కీలక పాత్ర పోషించాయని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. 


 112 అత్యవసర సేవల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఫేక్ కాల్స్ చేస్తే   కఠిన చర్యలు తీసుకుంటారు.