RTC MD Sajjanar Comments on Mahalaxmi Scheme: తెలంగాణలో ఈ నెల 9 (శనివారం) నుంచి 'మహాలక్ష్మి' పథకం (Mahalaxmi Scheme) కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Reavanth Reddy) ప్రారంభించారు. దీనిపై మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు. తెలంగాణకు చెందిన మహిళలకే ఈ సదుపాయం వర్తించనుంది. కాగా, ఈ పథకంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) స్పందించారు. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్టీసీ వ్యవస్థ 'మహాలక్ష్మి' పథకం ద్వారా పుంజుకుంటుందని అన్నారు. ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందుకు వస్తారని, దాని వల్ల ప్రజా రవాణా శాతం పెరుగుతుందని చెప్పారు. 'మహాలక్ష్మి'తో మహిళల స్వయం శక్తి పెరుగుతుందని, ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఈ పథకం వల్ల ఎంతో మేలు కలుగుతుందని వివరించారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడుతుందని, అయితే ఈ ఖర్చును ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సజ్జనార్ తెలిపారు. ప్రతిరోజూ దాదాపు 12 నుంచి 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లక్ష్యం నెరవేరేలా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. 


'అలా అయితే ఫ్రీ వర్తించదు'


'మహాలక్ష్మి' పథకం కింద కొంతమంది మహిళలు సామూహికంగా ఉచిత ప్రయాణం చేసేందుకు బస్సులు అనుమతించమని సజ్జనార్ స్పష్టం చేశారు. కొంత మంది మహిళలు కలిసి ఓ చోటుకు వెళ్లేందుకు బస్సును ఫ్రీగా బుక్ చేసుకుంటామంటే కుదరదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని, మహిళలందరికీ మేలు చేసేలా నిర్ణయించిన సదుపాయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. తొలుత వారం రోజులు ఎలాంటి ఐడీ కార్డు లేకుండానే బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని పొందవచ్చన్నారు. ఆ తర్వాత ఆధార్ వంటి ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రయాణ సమయంలో ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపిస్తే, ఆ వెంటనే వారికి జీరో టికెట్ మంజూరు చేస్తారని పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత  ఏయే ప్రాంతాల్లో రద్దీ ఉంటుందో స్పష్టత వస్తుందని, ఆ ప్రాంతాలకు అదనపు సర్వీసులు నడిపేలా చర్యలు చేపడతామన్నారు. 


మార్గదర్శకాలివే



  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచితం వర్తింపు. తెలంగాణకు చెందిన మహిళలకే ఈ సదుపాయం.

  • స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, కేంద్రం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు) ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి. ప్రయాణించే ప్రతి మహిళకు కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. 

  • రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచితం వర్తిస్తుంది.

  • ప్రత్యేక బస్సులు, స్పెషల్ టూర్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు. అలాగే మహిళలు సామూహికంగా ఓ చోటుకు వెళ్తామన్నా ఈ పథకం వర్తించదు.


మహిళల హర్షం


మరోవైపు, ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ సర్వీస్ తమకు ఓ వరమని విద్యార్థినులు, సాధారణ ఉద్యోగినులు అంటున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు జీతాలు వచ్చే వారికి దాదాపు రూ.2 వేలు ప్రయాణాలకే పోతుందని, అలాంటి సమయంలో ప్రభుత్వం ఈ పథకం కింద ఉచిత ప్రయాణం అమలు చేయడం సరైన నిర్ణయమని ప్రశంసిస్తున్నారు.


Also Read: Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి