RS Praveen Kumar Comments on Free Bus Scheme: తెలంగాణ ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకం (Mahalaxmi) ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఈ నెల 9 (శనివారం) నుంచి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పెదవి విరిచారు. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటున్న ఆర్టీసీపై ఈ పథకం వల్ల పెను భారం పడుతుందని అన్నారు. ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 50 వేల మంది కార్మికుల జీవితాలపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదని, ఉచిత ప్రయాణం పథకం నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను పునరుద్ధరిస్తారా.? అనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అలాగే, ఉచిత ప్రయాణం కారణంగా మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారని, దీంతో ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. లక్షలాది మంది ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి పడే అవకాశాలున్నట్లు వెల్లడించారు. తమ బతుకులు రోడ్డున పడతాయేమోనని ఆటో డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పట్టణాల్లో రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పూట గడవక చాలా మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 






వారికి హర్షం.. వీరికి భారం


తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం గొప్ప విషయమే అయినా తమకు ఉపాధి పోతుందని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 40 లక్షల మంది పరోక్షంగా దీనిపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవనభృతి అందించాలని కోరారు. మరోవైపు, ఈ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరు ఉద్యోగులు, విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగంగా ఉందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ప్రధాన పట్టణాల్లోని మెట్రో, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో సందడి నెలకొంది. 


'మహాలక్ష్మి' మార్గదర్శకాలివే



 



  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచితం వర్తింపు. తెలంగాణకు చెందిన మహిళలకే ఈ సదుపాయం.

  • స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, కేంద్రం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు) ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి. ప్రయాణించే ప్రతి మహిళకు కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. 

  • రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచితం వర్తిస్తుంది.

  • ప్రత్యేక బస్సులు, స్పెషల్ టూర్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు. అలాగే మహిళలు సామూహికంగా ఓ చోటుకు వెళ్తామన్నా ఈ పథకం వర్తించదు.


Also Read: Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు