Free bus To Women in Telangana: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని శనివారం ప్రారంభించింది. ఇందులో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో, సిటీలో అయితే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కానీ మహాలక్ష్మీ పథకం (Mahalakshmi scheme Telangana)లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మరుసటి రోజే ఆర్టీసీ బస్సులో మహిళల నుంచి టికెట్ కు ఛార్జీ వసూలు చేశాడు ఓ కండక్టర్. నిజామాబాద్ జిల్లాలో ఇది చోటుచేసుకుంది. 






ముగ్గురు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కారు. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఒక్కొక్కరికి రూ.30 చొప్పు కండక్టర్ వారి వద్ద నుంచి రూ.90 వసూలు చేశాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టిందని అందులో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళకు ఉచిత ప్రయాణం కల్పించారని మహిళలు చెప్పినా కండక్టర్ వినలేదు. తాను మాత్రం టికెట్ కొడుతున్నానని చెప్పి వారి వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేయడం వివాదాస్పదం అవుతోంది. మహిళలకు ఛార్జీ డబ్బులు తిరిగిచ్చేయాలని కొందరు చెప్పినా కండక్టర్ పట్టించుకోలేదు. పైగా డబ్బులు తిరిగిచ్చేది లేదన్నట్లు ప్రవర్తించారు. కండక్టర్ ఆ మహిళా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారని, ఆర్టీసీ సూచనలు, ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకున్నారని బస్సులోని తోటి ప్రయాణికులు ఆరోపించారు. 






విచారణకు ఆదేశించిన సజ్జనార్..
ఉచిత బస్ సౌకర్యం అమల్లో ఉన్నా కండక్టర్ మహిళల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేయడంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సజ్జనార్ తెలిపారు. సంబంధిత కండక్టర్‌ ను డిపో స్పేర్‌ లో ఉంచినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆ కండక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 


కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యంపై ఆడవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా తమకు నెలకు వెయ్యి నుంచి మూడు వేల వరకు మిగులుతుందని, వాటిని ఇంటి ఖర్చుల కోసం, ఇతరత్రా అవసరాలకు వాడుకుంటామని చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాల సమస్య తప్పడంతో పాటు మహిళలకు సెక్యూరిటీ కూడా ఉంటుందని చెబుతున్నారు.


Also Read: Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి