Telangana Minister Komatireddy Venkat Reddy in Amaravati: అప్పటి పరిస్థితుల్ని బట్టి తాను పవన్ కల్యాణ్‌ను విమర్శించానని ఇప్పుడు తాను ఎవర్నీ విమర్శించడం లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. ఆహ్వానించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలు, హెచ్చరికలపై స్పందించారు.
కోనసీమలో పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేశారని.. క్షమాపణ చెప్పి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే.. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా పవన్ కల్యాణ్ సినిమాను ఒక్క ధియేటర్‌లో కూడా విడుదల కానివ్వబోనన్నారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. అప్పటి పరిస్థితుల వల్ల పవన్ పై అలా వ్యాఖ్యలు చేశానని..నేను ఇప్పుడు ఎవర్నీ విమర్శించడం లేదని స్పష్టం చేశారు. ఏపీ మాకు ప్రత్యేకమని.. గతంలో సీఎం చంద్రబాబు విజన్-2020 అంటే ఆశ్చర్యపోయానన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ని చూస్తే నిజం అనిపిస్తోందన్నారు. చంద్రబాబు విజన్‌కు తగ్గట్లు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి అన్నారు.
ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా ఈవెంట్ జరుగుతోందిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తప్పకుండా చంద్రబాబు ను రమ్మని మా సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించామన్నరు. బిజీ షెడ్యూల్ లో కూడా గంటన్నర సమయం చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు తో తెలుగు రాష్ట్రాల రాజకీయాల పై చర్చ జరిగింది..కొన్ని బయటకు చెప్పలేమన్నారు. చంద్రబాబు హై టెక్ సిటీ అని చెప్పి బిల్ క్లింటన్ ను ఆహ్వానిస్తే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు కొంతమంది వెళ్ళలేదు..కానీ తాను వెళ్లానని గుర్తు చేసుకున్నారు.
అదే సమయంలో అసెంబ్లీకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పని .. అధికారపక్షం తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షానికే బాధ్యత ఉంటుందన్నారు. తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ విలీనం చేసుకున్న తర్వాత.. తమకు ఆరుగురే ఎమ్మెల్యేలున్నా.. తాము అసెంబ్లీలో పోరాడామని ఆయన గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాజకీయాలపై కూడా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకెక్కడ ఉందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతోందని రెండేళ్ల కిందట చెప్పానని.. చెప్పినట్లుగా జరిగిందా లేదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలే శాశ్వతంగా ఉంటాయన్నారు. ప్రాంతీయ పార్టీలు గాల్లో వస్తాయి. గాల్లో పోతాయని వ్యాఖ్యానించారు.