Breaking News: దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్క

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 13 Sep 2021 05:38 PM
దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన భట్టి

దళితబంధు పథకం అమలుపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఓ సమీక్షా సమావేశం జరుగుతోంది. హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌  మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు అమలుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.

వారంలో భక్తులందరికీ శ్రీవారి సర్వ దర్శన అవకాశం

మరో వారం రోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్ లైన్ బుకింగ్ ద్వారా సర్వ దర్శనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శనం టోకెన్‌లను ఆన్ లైన్‌లో విడుదల చేస్తామని అన్నారు. టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకన్లు అయిపోయాయని, భక్తులు ఆందోళనకు దిగడం, లాఠీచార్జి వంటి పరిణామాలు జరగడం బాధాకరమని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌కి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం వల్ల చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారని లేఖలో తెలిపారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం జగన్‌ కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం తెలిపారు.



హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని అపోలో వైద్యులు సోమవారం మధ్యాహ్నం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోందని తెలిపారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్ తేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి. 



నిమజ్జనం తీర్పు సవరించేందుకు హైకోర్టు నిరాకరణ

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్  ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని  హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించేందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఇవాళ రివ్యూ పిటిషన్‌ వేశారు. ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. 

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ జులై 18న ఉదయం యోగా చేస్తుండగా ఆసనంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు. చెకప్​లో భాగంగా మంగళూరులోని ఆసుపత్రికి వెళ్లగా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు.

సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో ఏడుగురు!

గుంటూరు జిల్లా మేడికొండూరు సామూహిక అత్యాచారం కేసులో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొర్రపాడుకు చెందిన పాత నేరస్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యాచారం ఘటనకు సంబంధించి వీరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌, సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. 

జీవోలు ఆన్ లైన్ లో ఉంచకూడదన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ 

జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో పిటిషన్లు వేసిన అనంతరం ప్రభుత్వం జీవో 100ను విడుదల చేసిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. జీవో నెబంర్ 100లో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరిట జీవోలను విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు ఈ జీవో విరుద్ధంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, యలమంజుల బాలాజీ కోర్టుకు వెల్లడించారు. రహస్యం పేరిట జీవోలను ఆన్ లైన్ లో పెట్టకపోవడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్లు తాజా పిటిషన్ దాఖలు చేసిన కౌంటర్ వేయాలని వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేసింది.

పెగాసస్ పిటిషన్లపై సుప్రీంలో విచారణ... నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధమన్న కేంద్రం

పెగాసస్ స్పై వేర్ స్వతంత్ర దర్యాప్తు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెగాసస్​పై మరో అఫిడవిడ్ సమర్పించలేదమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని పేర్కొంది. దేశ భద్రతతో ముడిపడిన అంశాలు చర్చించడం మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అయితే దేశ భద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి వెళ్లడం లేదని సీజేఐ జస్టిస్ ఎన్​.వి. రమణ అన్నారు. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 

టీటీడీ చరిత్రలోనే మెుదటిసారిగా 49 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే

టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హౌస్ బిల్డింగ్ లోన్ జారీలో అవకతవకలకు పాల్పడ్డారంటూ 49 మందికి షోకాజ్ నోటిసులు జారీ చేశారు.  టీటీడీ చరిత్రలోనే మొదటి సారి.. ఇలా 49 మంది ఉద్యోగులుకు నోటిసులు ఇవ్వడం.నోటిసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో నుంచి అటెండర్ వరకు ఉద్యోగులు ఉన్నారు. మరో విడతలో మరికొంత మందికి నోటిసులు జారీ చేసే అవకాశం ఉంది. కొద్ది రోజులు క్రితం ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంలో ఏడుగురు ఉద్యోగులను డిస్మిస్ చేశారు ఈవో జవహర్ రెడ్డి.

జీవో 316పై స్టేటస్ కో విధించిన ఏపీ హైకోర్టు

హైకోర్టులో ఏపీ రాజధాని అసైన్డ్ రైతులకు ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో 316పై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఈ జీవోను హైకోర్టులో న్యాయవాది ఇంద్రనీల్‍బాబు సవాల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్‍లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది ఇంద్రనీల్, ప్రభుత్వం వాదనలు విన్న అనంతరం స్టేటస్ కో విధిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎంఆర్డీఏని ఆదేశింది. 

స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష

 స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల నిర్మాణంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి గౌతమ్‌రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సలహాదారు మధుసూదన్‌రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అజయ్‌రెడ్డి హాజరయ్యారు. 

నటుడు రమేశ్ వలీయశాల ఆత్మహత్య

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్‌ వలీయశాల (54) ఆత్మహత్య చేసుకున్నారు.  22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు సెప్టెంబర్ 11న ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన మరణ వార్తతో మాలీవుడ్‌  చిత్ర పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

అందుబాటులోకి వచ్చిన టీటీడీ అగరుబత్తులు

తిరుపతి గోశాలలో టీటీడీ అగరబత్తులు విక్రయ, ఉత్పత్తి కేంద్రాన్ని టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి భక్తులకు టీటీడీ అగరబత్తీలు అందుబాటులోకి వచ్చాయి. అతి తక్కువ ధరలకే అగరబత్తీలను విక్రయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సుగంధభరిత అగరబత్తీలు 100 గ్రాములు 45రూపాయలకు విక్రయిస్తున్నారు. పుష్ప పరిమళ భరిత సహజ అగరబత్తులు 100 గ్రాములు 85 రూపాయలకు విక్రయిస్తున్నారు. 

ధర్మవరంలో ఉద్రిక్తత... టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ప్యాదిండి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పింఛన్ తొలగింపుపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాకు పర్మీషన్ లేదని పోలీసులు అంటున్నారు. ప్యాదిండి వద్ద పరిటాల శ్రీరామ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ భార్య కన్నుమూత

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.

హైకోర్టు నిమజ్జన ఆంక్షలపై జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్

తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ వేసింది. నిమజ్జన ఆంక్షలపై పునఃపరిశీలించాలని కోరింది. తీర్పులో నాలుగు అంశాలను తొలగించాలని కోరింది.  నిమజ్జనం అనంతరం 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు తెలిపింది. ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. నిమజ్జనానికి ఆరు రోజులు పడుతుందని పేర్కొంది. నెలల ముందే ప్రణాళికలు సిద్ధం చేశామని కోర్టుకు తెలిపింది. రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి తీర్పు లోని అంశాలను సవరించాలని కోరింది. 

మిమాపూర్ లో 13 నెలల బాలిక అనుమానాస్పద మృతి

హైదరాబాద్ సిటీ మియాపూర్‌లో 13 నెలల బాలిక అదృశ్యమైన ఘటన విషాదం అయ్యింది. ఇంటి సమీపంలోని నీటి గుంతలో బాలిక మృతదేహం లభించింది. చిన్నారి తల్లిదండ్రులు ఆదివారం పనులకు పాపను చూసుకోమని పక్కంటి వారికి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటూ జీవిస్తుంటారు. పనుల నుంచి తిరిగి వచ్చే సరికి బాలిక ఆచూకీలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఇవాళ ఉదయం నీటి గుంతలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రమాదమా, లేక హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల్లో స్పష్టత లేకపోవడంతో వారిని విచారిస్తున్నారు. ఓ బాలుడు నిన్న సాయంత్రం పాపను తీసుకెళ్లినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అప్పటి నుంచి బాలుడు కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. 

కదిరిలో యువకుడు దారుణహత్య

అనంతపురం జిల్లా కదిరి పట్టణం ఎంజీ రోడ్డులో నివాసం ఉంటున్న కిరణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మహారాష్ట్ర నుంచి బతుకు తెరువు కోసం కదిరికి వచ్చిన కిరణ్ పది సంవత్సరాల నుంచి బంగారు ఆభరణాలు కరిగించి వాటిని శుద్ధి చేసే పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం నుంచి సొంతంగా పనిచేసుకుంటున్న  కిరణ్ గత రాత్రి దారుణం హత్యకు గురయ్యాడు. ఇతని వద్ద కరిగించిన బంగారు, డబ్బులు ఎక్కువ ఉండటం వలన వాటి కోసం హత్య చేసి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏలూరు కాల్వలో బాలుడు గల్లంతు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏలూరు కాల్వలో బాలుడు గల్లంతయ్యాడు. తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనానికి తల్లితో జిష్ణు‍‌(16) వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి గల్లంతయ్యాడు. బాలుడి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 

యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదెవ్

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ లో రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్‌ ఘన విజయం సాధించాడు. ఈ విజయంతో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్‌ జకోవిచ్‌కు ఫైనల్ లో షాక్‌ ఇచ్చాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో జకోవిచ్‌ను ఓడించాడు. జకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ తో సమానంగా ఉన్నాడు. 

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.