Breaking News: హైదరాబాద్‌లో కారులో ఎగసిపడ్డ మంటలు.. వ్యక్తి సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 18 Sep 2021 09:29 PM
కారులో మంటలు, వ్యక్తి సజీవ దహనం

గోల్కొండ ప్రాంతం సమీపంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వస్తున్న కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌ నెంబరు 17 వద్దకు రాగానే ఈ మంటలు వచ్చాయి. క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తు్న్న వ్యక్తి సజీవ దహనమైయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్

ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా సాంబశివరావు పని చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీలో పని చేశారు. ఇప్పటికే సాంబశివరావుతో పాటు హరి ప్రసాద్‌ను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. సాంబశివరావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. గుంటూరు కోర్ట్‌లో హాజరుపరచనున్నారు.

డ్రగ్స్ కేసు: పూరీ, తరుణ్‌కు క్లీన్ చిట్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్‌కు ఈ కేసు నుంచి ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని ఎక్సైజ్ శాఖ తన ఛార్జిషీటులో వెల్లడించింది.

టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో టీఎంసీలో చేరారు. ఇటీవలె ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత రాజీనామా చేశారు. 


 





ఉస్మానియా పరీక్షలు వాయిదా..

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఎల్లుండి (సెప్టెంబర్ 20) జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. గణేష్ నిమజ్జనం కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం https://www.osmania.ac.in/ను సంప్రదించవచ్చని విద్యార్థులకు సూచించారు. 

పంజాబ్ లో ముదిరిన సంక్షోభం... రాజీనామా చేసే యోచనలో సీఎం అమరీందర్ సింగ్!

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరినట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలతో సీఎం అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశమై తదుపరి సీఎంను ఎన్నుకోనున్నట్లు సమాచారం.

సోనూసూద్ రూ.20 కోట్లకుపైగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలున్నాయి: ఐటీ అధికారులు


నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీ దాడుల్లో ఈ విషయం తెలిసిందని అధికారులు చెప్పారు.
సోనూసూద్‌ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేసింది. వరుసగా మూడో రోజులపాటు ఆయన నివాసం, తదితర ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. అయితే సోనూసూద్ పన్ను ఎగవేసినట్లు ఆధారాలు లభించాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. విదేశీ నిధులను తీసుకోవడంలో 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం' నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా వెల్లడించారు.

గణపతి నవరాత్రులలో అపశృతి... విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

తూర్పుగోదావరి జిల్లా కాజులూరులోని గణపతి నవరాత్రులలో అపశృతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఇద్దరు కళాకారులు మృతి చెందారు. కాజులూరు మండలం కోలంకలో జరుగుతున్న గణపతి నవరాత్రులలో మహోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమం ముగింపు దశలో ఉండగా శనివారం ఉదయం 5 గంటలకు మైకుకు షార్ట్ సర్య్కూలైంది. కపిలేశ్వరపురం మండలానికి చెందిన వాసంశెట్టి వెంకన్న, రామచంద్రపురం మండలానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. 

చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణపై రెండు కేసులు నమోదు

చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. జోగి రమేశ్‌ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. 

నెల్లూరులో రెచ్చిపోయిన ఇసుక మాఫియా... వ్యక్తిపై రాడ్లపై దాడి

నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. చేజర్ల మండలం ఉలవపల్లిలో కొందరు ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఇసుకాసురులు బొలిగర్ల జయరామయ్య అనే వ్యక్తిపై రాడ్లపై దాడి చేశారు. జయరామయ్య తలకు తీవ్రగాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా గురించి పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఒకరు మృతి

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్తంభాన్ని ఢీకొట్టిన కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి కారు అద్దాలు పగులగొట్టి వారిని కాపాడారు. అనంతరం ట్రాక్టర్లతో లాగి కారును ఒడ్డుకు చేర్చారు. శనివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో విజయవాడ నుంచి మోపిదేవి మండలం చిరువోలుకు వెళ్తున్నట్లు బాధితులు తెలిపారు.  

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు 13 జిల్లాల్లో 206 కేంద్రాల్లో పరిషత్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపునకు వీలుగా 206 కేంద్రాల్లో 958 హాళ్ల ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఏర్పాట్లను ఐఏఎస్ అధికారుల పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లకు కొవిడ్‌ వ్యాక్సిన్ తప్పనిసరి అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ కింద ఆంక్షలు విధిస్తారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించింది. 


 


 


 

గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు

ఏపీ టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఇవాళ కలవనున్నారు. శుక్రవారం చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనలను గవర్నర్ కు వివరించనున్నారు. వైసీపీ నేతలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. 

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.