Telugu States SC Classification Politics :    ఎస్పీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కోటా అమలు వైపే తెలంగాణ మొగ్గుచూపుతోంది. ఎస్సీ సబ్ కోటా వెంటనే అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరి ఏపీలో ఏం చేస్తారన్నది ఆసక్తిగా ఉంది. 


సుప్రీంకోర్టు తీర్పుపై ఆచితూచి స్పందిస్తున్న ఏపీ ప్రభుత్వం 


ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పును వెలువరించింది. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉప కులాలకు సబ్ కోటా కేటాయించుకునేందుకు రాష్ట్రాలకు అధికారం కల్పించింది. ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ తీర్పును అమలు చేసే విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ వెంటనే ఈ తీర్పును అమలు చేసి వర్గీకరణ చేయాలని ఆ ప్రభుత్వం దూకుడుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. 


షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగుమం అవడంతో తెలంగాణ ప్రభుత్వం తర్వాత కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఎస్సీలలో వెనుకబడిన ఉపకులాలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టనుంది.  తెలంగాణలో రాజకీయంగా కూడా అనుకూల పరిస్థితులు ఉన్న దృష్ట్యా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కోటా అమలు చేయడంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎస్సీ కేటగిరిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తమకు సరైన రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి -MRPS పేరుతో మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో వాళ్లు మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. తెలంగాణలో వీరి సంఖ్య కూడా ఎక్కువుగానే ఉంది. రిజర్వేషన్ అమలుపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే దఖలు పడటంతో..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది. 


రిజర్వేషన్ పై కమిషన్..?


ఎస్పీ వర్గీకరణ విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కొత్తకాదు. ఇంతకు ముందు జరిగిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఎస్సీవర్గీకరణ చేశారు. 1996లో వర్గీకరణ ఏర్పాటు చేయడానికి ముందు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగా 1997 నుంచి రిజర్వేషన్ అమలు చేశారు. 2004లో సుప్రీం కోర్టు సబ్ కేటగిరి రిజర్వేషన్‌ను కొట్టేసింది. ఇప్పుడు కూడా అలాంటి కమిషన్‌ను  ఏర్పాటు చేసి రిజర్వేషన్ అమలు చేయాలా లేక ఎస్సీలలో వెనుకబడిన కులాలను గుర్తించేందుకు సర్వే చేయాలా అని ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్ అమలు ఎలా చేయాలన్న ప్రక్రియను సుప్రీంకోర్టు నిర్దేశించనప్పటికీ.. ఉపకులాలను  గుర్తించడానికి నిర్దిష్టమైన డేటా ఉండి తీరాలని చెప్పింది. వర్గీకరణ సమతుల్యంగా ఉండాలని.. గుర్తింపు న్యాయబద్ధంగా ఉండాలని చెప్పింది. 


ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ చంద్రబాబుదే - మంద కృష్ణ ప్రశంసలు - ఏపీ సీఎం స్పందన ఏమిటంటే


అవసరమైతే ఆర్డినెన్స్ – సీఎం రేవంత్


సుప్రీం తీర్పు వచ్చిన సమయానికి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ వెంటనే స్పందించారు. తీర్పును స్వాగతించిన ఆయన వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్‌ను అమలు చేస్తామన్నారు. జాబ్ కాలెండర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ రిక్రూట్‌మెంట్‌లోనే వర్గీకరణను అమలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న వాళ్లు మాదిగలు. తెలంగాణలో ఎస్సీల్లో దాదాపు 70శాతం వారే ఉన్నారు. వర్గీకరణ అమలు చేస్తే.. రాజకీయంగా కూడా పార్టీకి లాభం. దీంతో రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేసేందుకు దూకుడుగా ఉన్నారు. నిన్న అసెంబ్లీలోనే డప్పు కొట్టి వర్గీకరణను స్వాగతించిన రేవంత్  ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని ప్రకటించారు. 
 
ఆంధ్రలో పరిస్థితి వేరు..!


ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా  ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన  సీఎంగా ఘనత దక్కించుకున్నారు చంద్రబాబు.  MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణా మాదిగ కూడా ఆ క్రెడిట్ ఆయనకు ఇచ్చారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు వర్గీకరణ అమలు విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. తెలంగాణ అంత వేగంగా ఆంధ్రలో స్పందించే పరిస్థితి లేదు. ఎమ్మార్పీఎస్ పోరాటం వల్లనైతేనేమీ, తెలంగాణలో ఉన్న మాదిగల సంఖ్యాబలం వల్లనైతేనేమీ చంద్రబాబు అప్పుడు అమలు చేశారు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాక కోస్తా ప్రాంతంలో మాలలు ఎక్కువుగా ఉన్నారు. ఎస్సీ కోటా 15శాతంలో  ఎక్కువ భాగం ఆర్ధికంగా విద్యాపరంగా ముందున్న మాలలే ఎక్కువుగా పొందుతున్నారని ఎమ్మార్పీఎస్ ఉద్యమం పుట్టుకొచ్చింది.  చంద్రబాబు కోటాను అమలు చేశాక... MRPS కు వ్యతిరేకంగా మాలమహానాడు ఉద్భవించింది. అప్పట్లో కాంగ్రెస్ వాళ్లకి మద్దతిచ్చింది. జనాభా పరంగా కోస్తాలో ఎక్కువుగా ఉన్న తమకు ఈ ఉపకోటా వల్ల అన్యాయం జరుగుతుందన్నది మాలల ఆందోళన. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో మాలల సంఖ్య ఎక్కువ. కోటా అమలు చేస్తే వారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం మాత్రమే కాదు ఏ పార్టీ కూడా దీనిపై నేరుగా స్పందించేందుకు సిద్ధంగా లేవు. ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిన దానిని ఒకప్పుడు చంద్రబాబు చేసి చూపించారని ఆయన ఘనతను చెప్పేందుకు ప్రయత్నించారు తప్ప... దీనిని అమలు చేస్తామని అధికారికంగా చెప్పలేదు. 


ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో అసలు సవాల్ - సమర్థించిన పార్టీలకు చిక్కులు - ఎందుకంటే ?


వర్గీకరణ జరిగింది ఇలా..


ఎస్సీకోటాలోని 15శాతం రిజర్వేషన్‌ను కేవలం కొన్ని కులాలు మాత్రమే పొందుతున్నాయని ఉద్యమాలు మొదలయ్యాయి. MPPS నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇది తీవ్రంగా జరిగింది. వాళ్ల పోరాటానికి తలొగ్గి చంద్రబాబు 1996లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆయన సిఫారసుల మేరకు 1997లో  ఎస్సీ కోటాను A,B,C,D గా వర్గీకరించారు. A కేటగిరిలోని రెల్లి ఇతర కులాలలకు 1శాతం, B కేటగిరిలోని మాదిగ ఇతర కులాలకు 7శాతం, C కేటగిరిలోని మాల ఇతర కులాలకు 6శాతం , D కేటగిరిలోని ఆది ఆంధ్ర ఇతర కులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. అయితే కమిషన్ సిఫారసులు అప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులకు భంగం కలిగిస్తున్నాయని మాల మహానాడు తప్పు పట్టింది. ప్రెసిడెండ్ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఉపకోటా వల్ల ఆ యా ప్రాంతాల్లో జనాభా లేని చిన్న చిన్న ఉపకులాల వాళ్లు మాల, మాదిగ పేరుతో సర్టిఫికెట్లు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. ఆ తర్వాత 2004లో సుప్రీంకోర్టు ఉపకోటాను రద్దు చేసింది.