Formula e Racing in Hyderabad: గతేడాది హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా - ఈ రేసింగ్ ఈవెంట్ కు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేస్తోంది. 2023 ఫిబ్రవరిలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లతో ఫార్ములా - ఈ రేసింగ్ నిర్వహించింది. ఈ వ్యవహారంలోనే ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంళవారం (జనవరి 9) మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అప్పుడు కుదిరిన కాంట్రాక్టులోని కొన్ని అంశాలపై పూర్తిగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆ మెమోలో కోరింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫోరమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని వివరణ అడిగింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.54 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారనే ఆరోపణలు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై ఉన్నాయి.
ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్ రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్వహకులు ఈసారి రద్దు చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా - ఈ కార్ రేసింగ్ ఈవెంట్ ను రేస్ రౌండ్-4, సీజన్ 10ను రద్దు చేసినట్లు ఇటీవలే ఫార్ములా - ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ) ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వంలోని మున్సిపల్ శాఖ.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30న జరిగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం - ఫార్ములా ఈ మధ్య ఈ రేస్ ఒప్పందం జరిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సీజన్ 10 రేస్‌లు జరగనున్న నగరాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ నగరాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మెక్సికోలోని హాంకూక్ లో తొలి రేస్ జరగనుంది.