New Fire Stations: తెలంగాణలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్ ల ఏర్పాటుతో పాటు అగ్నిమాపక శాఖళో ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. సిబ్బంది నియమించుకోవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖకు సూచనలు ఇచ్చింది. ఈ మేరకు జీవో ఎం. ఎస్ నంబర్ 64 ను రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కొత్త అగ్నిమాపక కేంద్రాలతో పాటు భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతిలో చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. కొత్త ఫైర్ స్టేషన్లతో పాటు ఇప్పటికే ఉన్న కేంద్రాల్లోని ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఫైర్ స్టేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
15 నియోజకవర్గాల్లో కొత్త పైర్ స్టేషన్లు
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఫైర్ స్టేషన్లు లేని శాసన సభ నియోజకవర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డబుల్ యూనిట్ కింద.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మల్కాజిగిరి, రంగా రెడ్డి జిల్లా పరిధిలోని ఎల్ బీ నగర్, రాజేంద్ర నగర్, షాద్ నగర్ లలో ఫైర్ స్టేషన్ లు మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలోని అంబర్ పేట, జూబ్లీహిల్స్, చాంద్రాయణ గుట్టలలో కొత్తగా ఫైర్ స్టేషన్లు రానున్నాయి. సింగిల్ యూనిట్ కింద మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో కొత్త పైర్ స్టేషన్లను టీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసింది. సిద్దిపేట జిల్లా కింద హుస్నాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి, నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండతో పాటు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ్య పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొత్తగా ఫైర్ స్టేషన్ రానుంది. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాకలోనూ ఫైర్ స్టేషన్ ను మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
స్వీపర్లు మినహా అన్నీ రెగ్యులర్ పోస్టులే
డబుల్ యూనిట్లలో ఒక అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ పోస్టు, 2 - స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, 4 - లీడింగ్ ఫైర్ మెన్లు, 5 - డ్రైవర్ ఆపరేటర్, 20 - పైర్ మెన్, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు, ఒక స్వీపర్ పోస్టు చొప్పున మొత్తం 34 పోస్టులు భర్తీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సింగిల్ యూనిట్లలో ఒక స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్ మెన్ ఇద్దరు, డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు, 10 మంది ఫైర్ మెన్లు, ఒకరు జూనియర్ అసిస్టెంట్, ఒకరు స్వీపర్ చొప్పున మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్వీపర్ మినహా మిగతావి అన్నీ రెగ్యులర్ పోస్టులు. స్వీపర్లను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు.