Belt Shops in Telangana: హైదరాబాద్: డ్రగ్స్ చెలామణి పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఉన్నతాధికారులకు సూచించారు. మరోవైపు బెల్ట్ షాపులు మూసివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గ్రామాల్లోని బెల్ట్ షాపుల కారణంగా యువత, చిన్నారులు మద్యానికి బానిస అవుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష బెల్ట్ షాపులను నిషేధించాలని (Ban on Belt Shops) ప్లాన్ చేస్తోంది. ముందు బెల్ట్ షాపుల లెక్క తేల్చి, వాటి వల్ల దుష్ప్రరిణామాలు లేకుండా చేసేందుకు గ్రామాల్లోని ఈ లిక్కర్ దందాను బంద్ చేపించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసివేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని బెల్టు షాపులపై ఉన్నతాధికారులు రిపోర్ట్ రూపొందించాలి. రాష్ట్రంలో 2,620 వైన్స్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉంటాయి. పలుచోట్ల ఈ బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం విక్రయాలు జరుగుతాయి. వీటి కారణంగా యువతతో పాటు విద్యార్థులు చెడు మద్యానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు బెల్ట్ షాపుల వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది. బెల్టు షాపులు క్లోజ్ చేసేలా వాటిపై ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది.
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి - సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవీ గుప్తా, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలని సూచించారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు. రాష్ట్రంలోని గ్రే హాండ్స్, ఆక్టోపస్ తరమాలో టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: KCR Video: దయచేసి అందరూ వెళ్లిపోండి, వేయి చేతులెత్తి మొక్కుతా - కేసీఆర్ వీడియో విడుదల