Telangana New Govt: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అంశంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో సర్వీసు అయిపోయాక కూడా ఇంకా వివిధ హోదాల్లో ఉన్నవారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఉన్నతాధికారుల జాబితాను తయారు చేస్తోంది. తుది జాబితా అనంతరం ఎప్పుడో రిటైర్ అయిన వారికి ఆయా హోదాల్లో కొనసాగింపు ఉంటుందా లేక తొలగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రిటైరయ్యాక కూడా వివిధ ఉన్నత హోదాల్లో కొనసాగుతున్న అధికారుల పేర్లతో ఓ జాబితా ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. బుధవారం (జనవరి 17) సాయంత్రం 5 గంటలలోపు వారి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల్లో ఉన్న వారి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. 


ఈ క్రమంలో ప్రస్తుతం కొత్త సర్కార్‌ దృష్టిలో ఐదుగురు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో MCRHRDITలో సలహాదారుగా ఉన్న రిటైర్డ్ IFS తిరుపతయ్య, ఆర్కియాలజీలో బుద్ధభవన్ ప్రాజెక్ట్ చూస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ శివనాగిరెడ్డి, ప్రోటోకాల్ అధికారిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అరవింద సింగ్, ఎండోమెంట్స్‌లో ఉన్న రిటైర్డ్ అధికారి అనిల్ కుమార్, రెండేళ్ల ఎక్స్ టెన్షన్‌తో పనిచేస్తున్న ఐఏఎస్ రాణి కుముదిని ఉన్నారు. వీరి విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.