Prajapalana Sub Committee: తెలంగాణలో ప్రజాపాలన (Prajapalana) అమలు విషయంలో ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని (Cabinet Sub Committee) నియమించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఛైర్మన్ గా ఉండనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండనున్నారు. ఈ మేరకు తెలంగాణ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (జనవరి 8) ఒక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజాపాలన నోడల్ ఆఫీసర్లు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజా పాలన దరఖాస్తుల విషయంలో డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీకి ఈ నెల చివరి వరకు సమయం కావాలని అధికారులు కోరారు.
రివ్యూ సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాము 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 30 వేల మంది ఆపరేటర్లతో ప్రజా పాలన దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ వేగంగా జరుగుతోందని అన్నారు.
అభయ హస్తం హామీల అమలుకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. ఈ ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ ఛైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహరించనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కమిటీ సభ్యులుగా తనతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పొన్నం ఉంటామని వివరించారు.