తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత రావడానికి కారణమైన ఉద్యోగ నోటిఫికేషన్లు. సంక్షేమ కార్యక్రమాల్లో ఆదర్శంగా ఉంటున్నామని చెప్పుకున్న పాలకులు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టలేకపోయారు. అందుకే ఆ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినట్టుగానే నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు గవర్నర్ ప్రసంగంలో తెలియజేసింది. 


హైదరాబాద్‌లో ఇచ్చిన యువ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించింది ప్రభుత్వం. యువతకు తాము ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభించామన్నారు. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 


దివాళా తీసిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడి పెడుతూనే సంక్షేమ పథకాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. 
ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎక్కడ దుబారా జరిగిందో కనిపెట్టే పనిలో యంత్రాంగం ఉందని వివరించారు. ప్రజలపై భారం మోపకుండానే సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. 


ఈ ప్రభుత్వం మాటల కంటే చేతల్లో ఎక్కువ చూపిస్తుందని భవిష్యత్‌లో ఆ మార్పు ప్రజలే గమనిస్తారని కూడా గవర్నర్ స్పష్టం చేశారు.