Few Days No chicken: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ ప్రారంభమయింది. చాలా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతూండటంతో  చికెన్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అడ్వయిజరీ జారీ చేసింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ,ఏపీలకు బర్డ్‌ ఫ్లూ వ్యాపించినట్లుగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు  సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు.


తూ.గో జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ  


ఏపీలో అధికారులు కూడా బర్డ్ ఫ్లూ కారణంగా అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్ లు ఏర్పాటు చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణె ల్యాబ్ నిర్ధారణ అయింది. దీంతో రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ 95429 08025 నెంబర్ తో ఏర్పాటు చేశారు. కోళ్లు ఎక్కడ చనిపోతున్న  పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలనీ హై అలెర్ట్ జారీ చేశారు. అలాగే ప్రజలు కొన్ని రోజులు పాటు  చికెన్ తినడం తగ్గించాలనీ జిల్లా కలెక్టర్ ప్రశాంతి  సూచనలు ఇచ్చారు. 


పెద్ద ఎత్తున చనిపోతున్న కోళ్లు 


ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు చనిపోతున్నాయి. ఒక్కో పౌల్ట్రీ ఫాం లో రోజుకు 10 వేలకు కోళ్లు చనిపోతూండటంతో.. బర్డ్ ఫ్లూ టెస్టులు చేయించారు. కానూరు శాంపిల్స్ కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.. కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా  విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించిన వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఆ పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), క్రోడిగుడ్లను కాల్చి వేయాలని ఆదేశాలు  ఇచ్చారు.  ఇంకా మిగిలిన ప్రాంతాల కోళ్ల శాంపిల్స్ కు సంబంధించిన   ల్యాబ్ రిపోర్ట్ లు రావాల్సి ఉంది.


ఇతర చోట్లా కూడా బర్డ్ ఫ్లూ పాజిటివ్ రిపోర్టులు


తణుకులోని   వేల్పూరు గ్రామం  కృష్ణానందం పౌల్ట్రీలో సోకిన ఏవియన్ ఇన్ఫ్లుఎంజా పై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు ఆదేశాలను జారీ చేశారు. 17 గ్రామాలు సర్వేలెన్స్ జోన్‌లో ఉన్నాయని, వాటిలో కొమరవరం, అత్తిలి, కావలిపురం, ఇయెర్ చెరువు, గోటేరు, మండపాక, ఇరగగవరం, తేతలి, రేలంగి గుమ్మంపాడు, పాలి, ఒరిగేడు, బల్లిపాడు, తనుకియు, మల్లిపాడు, అర్జునిడిపాలెం ఉన్నాయన్నారు. ఈ పరిధిలోని అన్ని చికెన్ దుకాణాలు, గుడ్డులు దుకాణాలు మూసివేయడానికి ఆదేశించినట్లు తెలిపారు. వ్యాధి సోకిన మరియు హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల మరియు వెలుపల కోళ్లు మరియు గుడ్ల రవాణా పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు.   ఆర్ఆర్ బృందాలకు యాంటీ వైరల్ మందులను, కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొన్న సిబ్బంది అందరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓ ఆదేశించారు. అడవి, వలస పక్షుల మరణాలు ఆ ప్రాంతంలో ఏమైనా జరిగితే పరిశీలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా అటవీ అధికారిని ఆదేశించారు.


మనుషులకు వస్తుందా ?


బర్డ్ ఫ్లూ సోకి చనిపోయి కోళ్లను తిన్నా.. బర్డ్ ఫ్లూ సోకినట్లుగా తెలియకపోయినా ఆ చికెన్ తిన్నా మనుషులకు కూడా ఆ ఫ్లూ సోకే అవకాశం ఉందన్న రిపోర్టులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమయింది.