Telangana PAC Appointed Incharges for Parliament Eelections: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తెలంగాణ పీఏసీ (Telangana PAC) తీర్మానించింది. గాంధీ భవన్ లో (Gandhi Bhawan) సోమవారం కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఏసీ ఛైర్మన్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వీహెచ్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ముందుగా అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక తొలిసారి జరిగిన పీఏసీ సమావేశంలో 5 అంశాలే ఎజెండాగా చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఒక్కో మంత్రికి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
పార్లమెంట్ స్థానాల వారీగా వీరికే బాధ్యతలు
- సీఎం రేవంత్ రెడ్డి - చేవెళ్ల, మహబూబ్ నగర్
- భట్టి విక్రమార్క - సికింద్రాబాద్, హైదరాబాద్
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి - ఖమ్మం, మహబూబాబాద్
- ఉత్తమ్ కుమార్ రెడ్డి - నల్లగొండ
- పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
- సీతక్క - ఆదిలాబాద్
- శ్రీధర్ బాబు - పెద్దపల్లి
- జీవన్ రెడ్డి - నిజామాబాద్
- దామోదర రాజనర్సింహ - మెదక్
- పి.సుదర్శన్ రెడ్డి - జహీరాబాద్
- తుమ్మల నాగేశ్వరరావు - మల్కాజిగిరి
- జూపల్లి కృష్ణారావు - నాగర్ కర్నూల్
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి - భువనగిరి
- కొండా సురేఖ - వరంగల్
ఇంకా ఏమన్నారంటే.?
తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని షబ్బీర్ అలీ తెలిపారు. 'రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల వివరాలు అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తాం. మంత్రి భట్టి విక్రమార్క సభలో గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టుల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారు. త్వరలోనే గ్రామసభలు పెట్టి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించాం. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్ నుంచి బరిలో నిలిచారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.' అని స్పష్టం చేశారు.
మహిళలకు రూ.2,500 భృతిపై
మహిళలకు నెలకు రూ.2,500 భృతిపై ఈ నెల 28న చర్చించి నిర్ణయం తీసుకుంటామని షబ్బీర్ అలీ ప్రకటించారు. రూ.4 వేల పెన్షన్ అమలు, విధి విధానాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, ఇంఛార్జీలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ చేసిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
పార్లమెంట్ నియోజకవర్గాల ఏఐసీసీ అబ్జర్వర్లు
- వరంగల్ - రవీంద్ర దాల్వి
- జహిరాబాద్ - మేయప్పన్
- నాగర్‌కర్నూలు - పీవీ మోహన్
- ఖమ్మం - ఆరీఫ్ నసీంఖాన్
- నల్లగొండ - రాజశేఖర్ పాటిల్
- పెద్దపల్లి - మోహన్ జోషి
- మల్కాజ్‌గిరి - రిజ్వాన్ అర్షద్
- మెదక్ - యూబీ వెంకటేశ్
- సికింద్రాబాద్ - రూబీ మనోహరన్
- హైదరాబాద్ - భాయ్ జగదప్
- భువనగిరి - శ్రీనివాస్
- మహబూబాబాద్ - శివశంకర్‌రెడ్డి
- ఆదిలాబాద్ - ప్రకాశ్ రాథోడ్
- నిజామాబాద్ - అంజలీ నింబాల్కర్
- మహబూబ్‌నగర్ - మోహన్ కుమార్ మంగళం
- చేవెళ్ల - ఎం.కె. విష్ణుప్రసాద్
- కరీంనగర్ - క్రిష్టోఫర్ తిలక్