CM Revanth Reddy Strong Counter to MIM MLA Akbaruddin in Assembly: తెలంగాణలో (Telangana) గత పదేళ్లుగా బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM) కలిసే ఉన్నాయని, బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులని కేసీఆరే చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం మండిపడ్డారు. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'గత పదేళ్లుగా బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే ఉన్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా ఎంఐఎం పని చేసింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నిజామాబాద్ అర్బన్ లో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా ఎంఐఎం పని చేసింది. అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే. ముస్లింలందరికీ నాయకుడు కాదు. ఆయన్ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా.? బీఆర్ఎస్ ప్రొగ్రెస్ రిపోర్ట్ మాత్రమే చదువుతున్న అక్బరుద్దీన్ కు లోపాలు కనిపించలేదా.? గత ప్రభుత్వాన్ని అదే పనిగా పొగుడుతుంటే వినేందుకు మేం సిద్ధంగా లేము. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


'మాకు ఆ తేడా లేదు'


బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని, గతంలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అక్బరుద్దీన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేదని అన్నారు. అక్బరుద్దీన్ అన్ని విషయాలను సభ ముందుంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 'ఎంఐఎంకు కేసీఆర్ మంచి మిత్రుడు కావొచ్చు. మోదీకి కూడా మద్దతివ్వొచ్చు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్ గా చేశాం. బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది. మీ మిత్రపక్షం బీఆర్ఎస్ ను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. అక్బరుద్దీన్ అన్ని విషయాలు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9 మంది చనిపోయారు. ఆ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయారు. ఆమె చనిపోతే ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు. మైనారిటీలను సీఎంలను, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీ.' అని రేవంత్ స్పష్టం చేశారు. విద్యుత్ బకాయిల్లో గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ సౌత్ టాప్ లో ఉంది. సూర్యాపేట జిల్లాలోనూ రైతులు కరెంట్ కోసం ఆందోళన చేశారు. కేటీఆర్, హరీష్ రావు, ఎంఐఎం బాధ్యత తీసుకుని విద్యుత్ బకాయిలు క్లియర్ చేస్తారా.? అని ప్రశ్నించారు. 


అక్బరుద్దీన్ తీవ్ర ఆగ్రహం


సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 'మేం ఎవరకీ భయపడం. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు. ఎంఐఎం ఎప్పుడు, ఎక్కడ పోటీ చేయాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. మమ్మల్ని బీజేపీ బీ టీం అంటున్నారు. మేం బతికి ఉన్నంత వరకూ బీజేపీతో కలిసి పనిచేయం. సీఎం రేవంత్ కు ఛాలెంజ్.' అంటూ సవాల్ విసిరారు. అక్బరుద్దీన్ ప్రసంగం సమయంలోనే ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.


Also Read: Telangana News: యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయ విచారణ - విద్యుత్ రంగంపై అసెంబ్లీ వాడీ వేడీ చర్చ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు