తెలంగాణలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈనెల 6వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం తీసుకొస్తున్నారు. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో, సంబంధిత కార్యదర్శులతో, ఉన్నతాధికారులతో మంగళవారం రాత్రి నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.
ప్రతి నియోజకవర్గంలో నుంచి ఒక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఎంపిక చేసి అల్పాహార ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.
విద్యార్థులకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సంపూర్ణ అల్పాహారాన్ని అందించాలని ఇటీవలే నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రతీ సంవత్సరం 400 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం అమలు సాధ్య సాధనలకై రాష్ట్ర ఉన్నతాధికారులు తమిళనాడులో పర్యటించారు. అక్కడ అమలు అవుతున్న అల్పాహార పథకం విధివిధానాలను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికను సమర్పించారు. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే ఈ పథకం అమలు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి అమలు చేయాలని నిర్ణయించింది.
ఏ రోజు ఏమేం పెడతారంటే..?
- సోమవారం - గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
- మంగళవారం - బియ్యం రవ్వ కిచిడి, చట్నీ
- బుధవారం - బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్
- గురువారం - రవ్వ పొంగల్, సాంబార్
- శుక్రవారం - మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్
- శనివారం - గోధుమ రవ్వ కిచిడి, సాంబార్
అయితో రోజుకు ఒక వెరైటీతో పిల్లల కడుపు నింపేందుకు సర్కారు ముందుకు వచ్చింది. మిల్లెట్లతో సాంబార్ లేదా చట్నీ కాంబినేషన్ లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని అందించబోతోంది.