తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హడావుడి కనిపించనుంది. శుక్రవారం నుంచి ఈనెల 21 వరకు వరుస కార్యక్రమాలకు ప్లాన్‌ చేసింది గులాబీ పార్టీ. రేపు వేలాది మందితో మెడికల్‌ ర్యాలీలు  నిర్వహించనుంది. రేపు రాష్ట్రంలో ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్‌,  హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్‌  కాలేజీలు ప్రారంభమవుతున్నాయని ప్రకటించారు. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు మంత్రులు,  ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. 


ఇక, ఎల్లుండి 16వ తేదీ... పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ దగ్గర ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని  ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి  వచ్చిన వారికి కలశాలతో కృష్ణానీటిని అందిస్తామని స్థానిక ప్రజాప్రతినిధిలు తెలిపారు. ఆ నీటిని ఆయా గ్రామాల చెరువులో చల్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. అంతేకాదు.. ప్రాజెక్టును  ప్రారంభించిన మరుసటి రోజు.. అంటే ఈనెల 17న.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు కలశాలతో  కృష్ణమ్మ నీటిని ఊరేగింపుతో తెచ్చి గ్రామాల్లోని దేవాలయాల్లో దేవుడి విగ్రహాలకు అభిషేకం చేయాలని దిశానిర్దేశం చేశారు. 


ఇక, ఈనెల 17న జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని  జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను  ఎగుర‌వేయ‌నున్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రభుత్వవిప్‌లు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 


ఇక, ఈనెల 21న రెండో విడత డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. హైదరాబాద్‌లో 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల విలువచేసే  డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయనుంది. 23 నియోజకవర్గాలకు చెందిన మరో 13వేల 300 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు పంపిణీ  చేయనున్నారు. మొదటి విడతలో అందించినట్టే.. పండుగ వాతావరణంలో డ్రాలో ఎంపిక చేసిన 13వేల 300 మంది నిరుపేదలకు గౌరవంగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాను  అందజేయనున్నారు. 


మొత్తంగా.. రేపటి నుంచి వారం పాటు జరగనున్న వరుస కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమవుతోంది. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల ప్రారంభోత్సాలను పండుగలా...  నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. దీంతో తెలంగాణలో వారం పాటు  గులాబీ హడావుడి కనిపించనుంది.