Techie Atul Subhash  Son To Stay With His Mother: భార్య తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని సుదీర్ఘమైన లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న టెకీ అతుల్ సుభాష్ తల్లిదండ్రులకు నిరాశే ఎదురయింది. తమ మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆ పిల్లవాడిని తమ ఎదుట హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. అయితే పూర్తి వివరాలు సమర్పించేందుకు అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా తరపు లాయర్లు వారం పాటు వాయిదా కోరారు. వివరాలు అన్నీ సమర్పిస్తామన్నారు.


 అయితే హేబియర్ కార్పస్ పిటిషన్ మీద విచారణ జరుపుతున్నాం కాబట్టి  వెంటనే హజరు పరచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వీడియో కాల్ ద్వారా ఆ కుమారుడ్ని న్యాయమూర్తుల ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తులు ఆ పిల్లవాడితో మాట్లాడారు. ఇంతకు ముందు తన కుమారుడ్ని హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించానన్నారు. ఇప్పుడు బెయిల్ షరతుల కారణంగా బెంగళూరులోనే ఉండాల్సి వస్తుందన్నందున ఆ అడ్మిషన్ రద్దు చేసుకున్నామని తెలిపారు. తన కుమారుడు మొదటి నుంచి తన వద్దనే ఉన్నారని అతుల్ సుభాష్ తల్లిదండ్రుల వద్ద ఎప్పుడూ లేరన్నారు.                        


 అయితే తమ మనవడ్ని తమకు అప్పగించాలని అడుగుతున్నా స్పందించడం లేదని.. చూపించడం లేదని సుభాష్ తల్లిదండ్రులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్లవాడితో మాట్లాడిన తర్వాత జస్టిస్ నాగరత్న తీర్పు చెప్పారు. తల్లి సంరక్షణలోనే ఉండాలని ఆదేశించారు. ఆ పిల్లవాడికి నాయనమ్మ పూర్తిగా అపరిచితురాలన్నారు. అయితే పిల్లవాడు పూర్తి స్థాయిలో ఎవరి కస్టడీలో ఉండాలన్నది దిగువకోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటి వరకూ తల్లి సంరక్షణలోనే ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 


బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అతుల్ సుభాష్ (34) తన మానసిక క్షోభ, వైవాహిక సమస్యలు, తన భార్య, ఆమె బంధువులు, ఉత్తరప్రదేశ్​కి చెందిన న్యాయమూర్తి వేధింపులను వివరిస్తూ 24 పేజీల సూసైడ్​ నోట్​ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  అతుల్ సుభాష్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు నికిత, నిషా, అనురాగ్, సుశీల్ సింఘానియాలపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులో నికితా సింఘానియా, ఆమె తల్లి, సోదరుడిని పోలీసులు డిసెంబర్​ 14న అరెస్టు చేశారు. తర్వాత కండిషనల్ బెయిల్ లభించింది. అతుల్​ సుభాష్​కి 2019లో వివాహం జరిగింది. వీరికి 2020లో కుమారుడు జన్మించాడు. కాగా అతుల్ సుభాష్ సూసైడ్ నోట్​ను తనకు అనుబంధంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వాట్సాప్ గ్రూప్​లో షేర్ చేశారు. అది దేశవ్యాప్తంగా వైరల్ అయింది. 



Also Read: Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!