TDP NRI Yashaswi Comments on Ycp Government: వైసీపీ ప్రభుత్వం (Ysrcp Government) తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా భయపడేది లేదని, పోరాటం కొనసాగిస్తానని టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త (TDP NRI Arrest) బొద్దులూరి యశస్వి (Bodduluru Yasaswi) (యష్) తెలిపారు. ఏపీ సీఐడీ పోలీసులు (AP CID Police) ఎయిర్ పోర్టులోనే తనను అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు గత నాలుగేళ్లలో దాదాపు ఐదుసార్లు తెనాలిలోని తన ఇంటిపై దాడి చేశారని చెప్పారు. తల్లికి ఆరోగ్యం బాగా లేదని, చూసేందుకు అమెరికా నుంచి వచ్చానని చెప్పినా సీఐడీ పోలీసులు వినిపించుకోలేదని వాపోయారు. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి తనను 4 గంటలకు పైగా శంషాబాద్ విమానాాశ్రయంలోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గుంటూరు కార్యాలయానికి తరలించారని చెప్పారు. 'ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నందుకు మా గొంతు నొక్కి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. కానీ మా పోరాటం ఎప్పటికీ ఆగదు. సీఎం జగన్ అభివృద్ధి, రాజధాని అంశాలపై దృష్టి పెట్టకుండా ప్రశ్నించిన వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రజలంతా ఆలోచించాలి. తల్లికి ఆరోగ్యం బాగాలేదన్నా సీఐడీ పోలీసులు కనికరించలేదు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
వృత్తి రీత్యా అమెరికాలో ఉంటున్న టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్) అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆయన్ను చుట్టుముట్టారు. తమ వెంట రావాలని చెప్పగా, తన తల్లికి బాగాలేకపోతే చూసేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. ఆయన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు (Guntur) సీఐడీ కార్యాలయానికి తరలించారు. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM Jagan) కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విడుదల చేశారు. 2024, జనవరి 11న తిరుపతి (Tirupati) సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.
టీడీడీ నేతల ఆగ్రహం
కాగా, సీఐడీ పోలీసుల తీరును టీడీపీ నేతలు ఖండించారు. సీఎం జగన్ అక్రమ అరెస్టులపై కాదని, అంగన్వాడీల సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. యశ్ ను అరెస్ట్ చేయటానికి పెట్టిన శ్రద్ధ ఇంటి పక్కన నిరసనలు చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం సమయం పెట్టలేదని మండిపడ్డారు. ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వ విధానాలేంటో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటు, నారా లోకేశ్ సైతం యశస్విపై సీఐడీ తీరును తప్పుబట్టారు. 'ప్రశ్నించే గొంతుకలను నిర్బంధాల ద్వారా వైసీపీ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోంది. న్యాయం జరిగే వరకూ విశ్రమించబోం. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయి.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యష్ అరెస్టుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సీఎం జగన్ సైకోయిజానికి యష్ అరెస్ట్ నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులు, అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.? అని నిలదీశారు. వైసీపీ నియంతృత్వ పోకడలకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.