TDP Chief Chandrababu Naidu Comments: చిత్తూరు (Chittoor) జిల్లాలో  తెలుగుదేశం పార్టీ (TDP News) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం (Kuppam) నియోజకవర్గంలోని గుడుపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గుడుపల్లి నాకు గుండె లాంటిదన్న ఆయన, కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ భాగంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామన్నారు. నిరుద్యోగులకు నెలకు 3వేలు ఇస్తామని, యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదన్నారు.


వంద రోజులు తన కోసం, మీ కోసం పని చేయాలని ప్రజలు, తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు, ప్రజల జీవితాలను మార్చే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటాయని హామీ ఇచ్చారు.  వైసీపీకి వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని,  ఆ పార్టీ సినిమా అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు. ప్రతి ఇంటికి రెండు ఆవులు ఉంటే మంచిదని ఎప్పుడో చెప్పానన్న చంద్రబాబు, అపుడు తనను ఎగతాలి చేశారని విమర్శించారు. పాడిని పరిశ్రమగా తయారు చేసి ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తానన్నారు.


విద్యార్థులే గెలిపించారు


అంతకుముందు కర్ణాటకలోని బెంగళూరులో పర్యటించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. తొలిసారి తనను విద్యార్థులే గెలిపించాలని గుర్తు చేసుకున్నారు. విజన్‌-2020 గురించి చెప్పినప్పుడు అందరూ అవమానించారని, ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు హేళన చేశారని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ...ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రొత్సహించానన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్న చంద్రబాబునాయుడు, విద్యార్థులందరూ ఉపాధి కల్పించేస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు.