Tamil Nadu  Education Policy only two language system:  తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర విద్యా విధానం (SEP)ను ప్రకటించారు.  ఈ విధానం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానం (NEP 2020)కు ప్రత్యామ్నాయంగా రూపొందించారు.  తమిళనాడు  ప్రత్యేక సాంస్కృతిక,  విద్యా అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్నామని స్టాలిన్ స్పష్టం చేశారు. 

 తమిళనాడు పాఠశాలల్లో తమిళం , ఇంగ్లీష్ రెండు భాషలను మాత్రమే నేర్పిస్తారు.   ఈ ద్విభాషా విధానాన్ని రాష్ట్రం అనుసరిస్తుందని స్టాలిన్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన NEPలో మూడు భాషల ఫార్ములాను తమిళనాడు తిరస్కరించింది. మూడో భాషగా హిందీ ఉంది. అయితే   హిందీని నేర్పించే ప్రశ్నే లేదని తమిళనాడు ప్రభుత్వంస్పష్టం చేసింది. తమిళ భాషను  CBSE, ICSE, కేంద్రీయ విద్యాలయాలు సహా అన్ని బోర్డులలో తప్పనిసరి చేస్తూ తమిళ లెర్నింగ్ యాక్ట్‌ను అమలు చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. 

రాష్ట్ర విద్యా విధానం సైన్స్, ఇంగ్లీష్,   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక రంగాలపై దృష్టి సారిస్తుందని సీఎం తెలిపారు.   ఈ విధానం విద్యార్థులను గ్లోబల్ అవకాశాలకు సిద్ధం చేయడం,  సృజనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  ఈ విద్యా సంవత్సరం నుండి 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ SEPలో నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. అంటే ఇంటర్ ఫస్టియర్ కుపబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవన్నమాట. 

ఆర్ట్స్ , సైన్స్ కోర్సుల కోసం అండర్ గ్రాడ్యుయేట్ (UG) అడ్మిషన్లు 11వ ,  12వ తరగతుల మొత్తం మార్కుల ఆధారంగా జరుగుతాయని స్టాలిన్తెలిపారు.  NEPలో ప్రతిపాదించిన సాధారణ ప్రవేశ పరీక్షలను తిరస్కరించారు. అలాగే  NEPలో ప్రతిపాదించిన 3, 5,   8 తరగతులలో పబ్లిక్ పరీక్షలను SEP తిరస్కరించింది. ఈ పరీక్షలు విద్యార్థుల డ్రాపౌట్ రేటును పెంచుతాయని, విద్య  వాణిజ్యీకరణకు దారితీస్తాయని స్టాలిన్ పేర్కొన్నారు.   2025లో 12వ తరగతి ఉత్తీర్ణులైన 75 శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారని, రాబోయే సంవత్సరాల్లో దీనిని వంద శాతానికి  చేర్చాలని స్టాలిన్ లక్ష్యంగా పేర్కొన్నారు.                  

 2022లో రిటైర్డ్ జస్టిస్ డి. మురుగేసన్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.  ఈ కమిటీ   2024 జూలైలో తమ నివేదికను స్టాలిన్‌కు సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుత రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించారు.