Tamil Nadu Krishnagiri MP took oath in Telugu :  లోక్‌సభలో వివిధ రాష్ట్రాల ఎంపీల ప్రమాణం జరుగుతోంది. తమ తమ రాష్ట్రాల భాషల్లో ఎంపీలు ప్రమాణం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా తెలుగులో చేశారు. తమిళనాడు ఎంపీలు తమిళంలో చేశారు. కానీ ఒక్క ఎంపీ మాత్రం తెలుగులో ప్రమాణం చేశారు. ఆయన తమిళనాడులోని కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ కె.గోపినాథ్. 


కృష్ణగిరి నుంచి గెలిచిన తెలుగు మూలాలున్న నేత గోపీనాథ్                        
 
తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ ఎంపీ కె. గోపినాథ్   లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.  కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యాంగ ప్రతిని చేతితో పట్టుకుని ప్రమాణం చేస్తున్నారు. ఆయన కూడా  రాజ్యాంగ ప్రతిని ఓ చేత్తో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు.  చివర్లో ‘జై తమిళనాడు’  అని ముగించారు. 


 






మూడు రాష్ట్రాల బోర్డర్ లో ఉండే హోసూరు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపు                            


గోపీనాథ్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తెలుగు వ్యక్తి. ఆయన హోసూరు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.  కృష్ణగిరి జిల్లా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. ముఖ్యంగా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సమీపంలో ఉంటుంది.   ఇక్కడి ప్రజలు తమిళంతోపాటు తెలుగు, కన్నడ భాషలు కూడా మాట్లాడతారు. అయితే గోపీనాథ్ మాత్రం తన మాతృభాష తెలుగు కోసం పోరాడుతూనే ఉంటారు.           


అసెంబ్లీలోనూ పలుమార్లు తెలుగులో మాట్లాడిన గోపీనాథ్                                   


ఓ సారి తమిళనాడులో జయలలిత ప్రభుత్వం తమిళనాడులో తమిళ్ ను తప్పనిసరి చేస్తూ.. చట్టం తెచ్చింది. ఆ చట్టంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న  గోపీనాథ్ అసెంబ్లీలో జయలలితను ప్రశ్నించారు. తమిళనాడులో మైనార్టీ భాషలను చంపవద్దని.. తమ మాతృభాషలో చదువుకునే అవకాశం భావితరాలకు కల్పించాలని కోరారు. అప్పుడు జయలలిత కూడా తెలుగులోనే ఆయనకు సమాధానం ఇచ్చారు. 


తమిళనాడులో తెలుగు భాష ఉనికి  పోకుండా పోరాటం                                


తమిళనాడులో భాషాభిమానం ఎక్కువే అయినా.. ఇతర భాషలను గౌరవిస్తారని.. గోపీనాథ్ ఉదంతం తెలియచెబుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా కాలంగా ఆయన తమిళనాడులో తెలుగు భాష కోసం పోరాడుతూనే ఉన్నారు.