Migrant Workers in Tamil Nadu:



ఉత్తరాది కూలీలపై దాడులు..?


తమిళనాడులో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే కూలీలపై దాడులు జరుగుతున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఇదంతా ఫేక్ అని పోలీసులు చెబుతుంటే..దాడులు జరుగుతున్నాయంటూ మరి కొందరు వాదిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వలసకూలీలు భయభ్రాంతులకు లోనవటంతో తమిళనాడు పోలీసులు, ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వివాదంపై స్పందించారు. వలస కూలీలను రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


"వలస కూలీలు  భయపడాల్సిన పని లేదు. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. తమిళనాడు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది"


-స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి










రెండు రాష్ట్రాలు అలెర్ట్..


తమిళనాడు, బిహార్ ప్రభుత్వాలు ఇప్పటికే వేరువేరు ప్రకటనలు చేశాయి. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఇలాంటి వీడియోల కారణంగా కార్మికులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నాయి. అటు బిహార్ అసెంబ్లీలోనూ ఈ వివాదంపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. తమ రాష్ట్రానికి చెందిన కార్మికులను ప్రత్యేకంగా కలిసి మాట్లాడతామని బిహార్ అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వాట్సాప్‌లోనూ పెద్ద ఎత్తున వీడియోలు, మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతుండటాన్ని గమనించారు. జిల్లా కలెక్టర్‌లు కూడా కార్మికులకు భరోసా ఇచ్చారు. భయపడాల్సిన పని లేదని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు ఈ వివాదంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. అయితే తమిళనాడు పోలీసులు మాత్రం ఈ వీడియోలన్నీ ఫేక్ అని తేల్చి చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలు సృష్టిస్తున్నారని అన్నారు.