AIADMK SP Velumani vs EPS: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే మరోసారి నిలువునా చీలిపోయే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ.. మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి వర్గం సెపరేట్ గ్రూపుగా ఏర్పడటం ప్రకంపనలు సృష్టిస్తోంది.  తమిళనాట ద్రవిడ రాజకీయాలు మరోసారి ఉత్కంఠ భరితమైన మలుపు తిరిగాయి. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అన్నాడీఎంకేలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి నేతృత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎవరన్న అంశంపై ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తోంది.

Continues below advertisement

అన్నాడీఎంకేకు చెందిన సుమారు  30 మంది ఎమ్మెల్యేలు  ఎస్.పి. వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎంచుకున్నారు. మరోవైపు, ఎడప్పాడి పళనిస్వామికి కేవలం 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు తమ తమ నేతలే  అసలైన అన్నాడీఎంకే అని పేర్కొంటూ అసెంబ్లీ సెక్రటరీకి విడివిడిగా లేఖలు అందజేసినట్లుగా తెలుస్తోంది.  పశ్చిమ తమిళనాడులో బలమైన పట్టున్న వేలుమణి, ఇప్పుడు చెన్నై వేదికగా ఎడప్పాడిపై తిరుగుబాటు చేయడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

 స్పీకర్ చేతిలో అన్నాడీఎంకే భవితవ్యం 

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా,  అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎవరిని గుర్తించాలనే నిర్ణయం ఇప్పుడు  అసెంబ్లీ స్పీకర్ చేతిలోకి వెళ్లింది. కొత్తగా ఎన్నికయ్యే స్పీకర్ ఈ రెండు లేఖలను పరిశీలించి, సంఖ్యాబలం ఆధారంగా ఏ వర్గానికి గుర్తింపు ఇవ్వాలో నిర్ణయిస్తారు. అది వరకు అసెంబ్లీలో అన్నాడీఎంకే సీటింగ్ అమరిక,  ప్రతిపక్ష నేత హోదాపై సందిగ్ధత కొనసాగే అవకాశం ఉంది.

 విజయ్ పార్టీ  వైపు చూపు? 

 ఈ చీలిక వెనుక రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని మరో వర్గం కూడా ఎడప్పాడిపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ రెబెల్ ఎమ్మెల్యేలలో కొందరు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం  కు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఫలితాల్లో మూడో స్థానానికి పడిపోయిన అన్నాడీఎంకేను కాపాడుకోవాలంటే నాయకత్వ మార్పు తప్పదని వేలుమణి వర్గం వాదిస్తోంది.  వరుస ఓటములతో సతమతమవుతున్న అన్నాడీఎంకేను ఇప్పుడు అంతర్గత విభేదాలు దహించివేస్తున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి తన పట్టు నిలుపుకుంటారా లేక వేలుమణి వర్గం అసెంబ్లీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటుందా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఒకవేళ వేలుమణి వర్గాన్ని స్పీకర్ గుర్తిస్తే, అన్నాడీఎంకేలో ఎడప్పాడి శకం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.