Petrol and Diesel Price Hike Imminent in India: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత ఇప్పుడు భారతీయ వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 50 శాతం మేర పెరిగినప్పటికీ, మన దేశంలో పెట్రోల్ రూ. 94.77, డీజిల్ రూ. 87.67 వద్దే కొనసాగుతున్నాయి. అయితే, ఈ ధరలను ఇలాగే కొనసాగించడం ప్రభుత్వ చమురు సంస్థలకు తలకు మించిన భారంగా మారుతోంది. ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇంధనాన్ని ఆదా చేయాలని కోరడం, రాబోయే భారీ ధరల పెంపునకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.

Continues below advertisement

రూ. 1 లక్ష కోట్ల భారీ నష్టం..గత 10 వారాలుగా ఐఓసీ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయ ధరల షాక్ నుంచి భారతీయులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అప్పటికే 30 శాతం వరకు ధరలు పెంచినప్పటికీ, మన దగ్గర పాత రేట్లే అమలవుతున్నాయి. దీనివల్ల ఈ సంస్థలకు రోజుకు రూ. 1,600 నుంచి రూ. 1,700 కోట్ల వరకు నష్టం (Under-recovery) వస్తోంది. ఇప్పటివరకు ఈ మొత్తం నష్టం రూ. 1 లక్ష కోట్లు దాటిపోయింది. చమురు సంస్థల దగ్గర ఉన్న నిధులు తగ్గిపోతుండటంతో, ఇకపై పాత ధరలకే ఇంధనాన్ని విక్రయించడం అసాధ్యమని తెలుస్తోంది.

Continues below advertisement

ప్రభుత్వ జోక్యం , ఎక్సైజ్ డ్యూటీ కోత..చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని రూ. 13 నుంచి రూ. 3 కి, డీజిల్‌పై రూ. 10 నుంచి సున్నాకు తగ్గించడం వల్ల నెలకు ప్రభుత్వానికి రూ. 14,000 కోట్ల ఆదాయం తగ్గుతోంది. ఇంత చేస్తున్నా కూడా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD) సమస్య తలెత్తుతోంది. దీనివల్ల దేశ ఆర్థిక భద్రతను కాపాడటం కోసం ధరల పెంపు అనేది ఇప్పుడు కేవలం ఒక పొలిటికల్ నిర్ణయంగా మాత్రమే మిగిలింది. ప్రభుత్వం ఎప్పుడు పచ్చజెండా ఊపితే అప్పుడు ధరలు పెరగడం ఖాయం. దీంతో అన్ని రకాల రంగాలపై ఈ ప్రభావం కనపడే అవకాశముందని తెలుస్తోంది.

రాబోయే సవాళ్లు..చమురు సంస్థల ఆర్థిక స్థితి దెబ్బతింటే అది భవిష్యత్ పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. రిఫైనరీల విస్తరణ, ఇథనాల్ బ్లెండింగ్, బయో ఫ్యూయల్స్ వంటి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. జపాన్, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే ధరలను భారీగా పెంచాయి. భారత్ లో ఇప్పటివరకు నియంత్రణలో ఉన్నా, ముడిచమురు దిగుమతుల్లో 40 శాతం ఈ సంక్షోభం వల్ల ప్రభావితం అవుతుండటంతో పరిస్థితి సీరియస్ గా ఉంది. వాహనదారులు ఇకపై పెరిగే ధరలకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసిన గల్ఫ్ వార్.. ఇప్పుడు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపించే అవకాశముంది.  ఇంధన పొదుపు పాటించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభం నుంచి కొంతవరకు గట్టెక్కే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.