కాబూల్ లో ఆదివారం అమెరికా చేసిన డ్రోన్ దాడిని తాలిబన్లు ఖండించారు. దాడి చేసే ముందు తమకు సమాచారం ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఈ మేరకు తాలిబన్ల ప్రతినిధి జబిఉల్లా ముజాహిద్ చైనాకు చెందిన సీజీటీఎన్ ఛానల్ కు లిఖిత పూర్వక సమాచారమిచ్చారు.
కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఐసిస్-కె పన్నిన కుట్రను అమెరికా ఆదివారం భగ్నం చేసింది. ముష్కరుల వాహనంపై అమెరికా డ్రోన్ దాడి జరిపింది. అయితేె ఈ దాడిలో చిన్నారులు సహా 10 మంది మృతి చెందారని అఫ్గాన్ వార్తా సంస్థ టోలో న్యూస్ తెలిపింది.
దాడి సరైనదే..
అయితే ఈ దాడిని అమెరికా సమర్థించుకుంది. ఐసిస్-కె.. కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో దూసుకొస్తున్నట్లు గమనించి డ్రోన్ దాడి చేసినట్లు పెంటగాన్ పేర్కొంది.
నేడు మరో దాడి..
నేడు కాబూల్ విమానాశ్రయమే లక్ష్యంగా మళ్లీ రాకెట్ దాడులు జరిగాయి. సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. కాసేపటి తర్వాత వాటిని కూల్చేసిన శబ్దాలు వినిపించినట్లు చెప్పారు. వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్ల తెలుస్తోంది. ఈ దాడిని అమెరికా ధ్రువీకరించింది.
ముష్కరులు కాబూల్ విమానాశ్రయమే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారని తాము వాటిని తిప్పికొడుతున్నామని అమెరికా పేర్కొంది. దాడులకు పాల్పడే వారిని ఊరికే వదలేది లేదని అమెరికా హెచ్చరించింది.
Also Read: Afganisthan Crisis Update: కాబూల్ విమానాశ్రయంపై రాకెట్ల వర్షం.. 'డెడ్ లైన్'కు ముందు ఉద్రిక్తత