Swati Maliwal Assault Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని సిబ్బంది తనపై దాడి చేసిందంటూ ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌పై కంప్లెయింట్ ఇచ్చిన ఆమె దాడి ఎలా జరిగిందో వివరించారు. చెంప దెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని లాగి, ఛాతిపై కాలితో తన్నినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌లో ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. ఈ ఫిర్యాదు ప్రకారం స్వాతి మలివాల్‌ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు స్పందించలేదు. కాసేపటి తరవాత డ్రాయింగ్‌ రూమ్‌లో వెయిట్ చేయాలని చెప్పారు. అక్కడ ఎదురు చూస్తున్న సమయంలోనే బిభవ్ కుమార్ లోపలికి వచ్చి తీవ్రంగా దూషించడం మొదలు పెట్టాడు. ఆ తరవాత వచ్చి 7-8  సార్లు చెంపపై కొట్టడమే కాకుండా ఛాతి, కడుపుతో పాటు సెన్సిటివ్ పార్ట్స్‌పై చేశాడు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా వదిలి పెట్టకుండా అసభ్య పదజాలంతో తిట్టాడు. "నేను పీరియడ్స్‌లో ఉన్నాను. కడుపు నొప్పిగా ఉంది. వదిలేయమని చెప్పినా వినకుండా కాలితో తన్నాడు" అని ఫిర్యాదులో ప్రస్తావించారు స్వాతి మలివాల్. 


"అలా ఉన్నట్టుండి వచ్చి దాడి చేసే సరికి షాక్ అయ్యాను. సాయం కోసం గట్టిగా కేకలు పెట్టాను. నన్ను నేను రక్షించుకునేందుకు కాళ్లతో అతడిని తన్నేశాను. తరవాత మరింత కోపంగా వచ్చి నాపై దాడి చేశాడు. నా చొక్కా పట్టుకుని లాగాడు. దారుణంగా నేలపైనే లాక్కొచ్చాడు. ఛాతి, కడుపుతో పాటు సెన్సిటివ్ పార్ట్స్‌పైనా తన్నాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాను. ఒక్కసారిగా ట్రామాలోకి వెళ్లిపోయాను. కాసేపటికి తేరుకుని 112కి కాల్ చేసి సాయం అడిగాను"


- స్వాతి మలివాల్, ఆప్ ఎంపీ


కేజ్రీవాల్ ఇంట్లోని మిగతా సిబ్బంది కూడా బిభవ్ కుమార్‌నే సపోర్ట్ చేశారని ఆరోపించారు స్వాతి మలివాల్. పోలీసులు వచ్చేంత వరకూ ఇంటి బయటే ఎదురు చూడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. AIIMS ట్రామా సెంటర్‌కి తీసుకెళ్లిన పోలీసులు ఆమెకి మెడికల్ చెకప్ చేయించారు. అయితే..ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్‌ పరారీలో ఉన్నాడు. నిందితుడుని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. క్రైమ్ బ్రాంచ్‌తో పాటు స్పెషల్ సెల్‌ విచారణ జరుపుతోంది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ కేసుపై FIR నమోదు చేశారు. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా బిభవ్ కుమార్‌కి సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేయడంపై అసహనం వ్యక్తం చేసిన స్వాతి మలివాల్ కీలక ట్వీట్ చేశారు. 


 






Also Read: Rashmika Mandanna: బీజేపీకి సౌత్ స్టార్ దొరికిందా? రష్మిక మరో కంగనా అవుతుందా - ప్రమోషన్ వీడియోతో ఆసక్తికర చర్చ