Delhi News in Telugu: స్వాతి మలివాల్‌ కేసులో (Swati Maliwal Assault Case) కీలక సాక్ష్యంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు సీజ్ చేసిందని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ని కావాలనే దాచి పెట్టి కట్టుకథలు అల్లేందుకు సిద్ధమవుతున్నారంటూ విమర్శలు చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు కావాలనే పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాలని కుట్ర చేస్తోందని మండి పడింది. అయితే...ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇంకా స్పందించలేదు. ఇప్పటికే స్వాతి మలివాల్ దాడి కేసులో నిందితుడు, కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఇదంతా డ్రామా అని కొట్టి పారేస్తున్నారు. తన సహాయకుడిని కావాలనే టార్గెట్ చేశారని ఆరోపించారు. బిభవ్ కుమార్‌తో పాటు వరుస పెట్టి ఆప్‌ నేతల్ని జైలుకి పంపుతారని అన్నారు. అంతే కాదు. బీజేపీ తీరుని నిరసిస్తూ Jail Bharo కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి పార్టీ నేతలతో కలిసి ముట్టడించారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా జరుగుతుండగానే ఇప్పుడు పోలీసులు సాక్ష్యాన్ని మాయం చేశారని ఆరోపించడం మరో సంచనలంగా మారింది. 


ఏం జరిగింది..?


మే 13వ తేదీన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ అరవింద్ కేజ్రీవాల్‌ని కలిసేందుకు (Swati Maliwal Case) ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే డ్రాయింగ్‌ రూమ్‌లో ఉన్న తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ దాడి చేశాడని మలివాల్ ఆరోపించారు. 7-8 సార్లు చెంపదెబ్బలు కొట్టడమే కాకుండా కడుపులో తన్నాడని చెప్పారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వదలకుండా పదేపదే కాలితో తన్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడడమే కష్టమైందని అన్నారు. ఈ కంప్లెయింట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు బిభవ్ కుమార్‌ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే..కేజ్రీవాల్ ఇంట్లో నుంచి స్వాతి మలివాల్ బయటకు వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. భద్రతా సిబ్బందిలోని ఓ మహిళ స్వాతి మలివాల్ చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చింది. ఆ సమయంలో ఆమె చేయి విదిలించుకున్నారు. ఈ విజువల్స్ మాత్రమే బయటకు వచ్చాయి. అయితే..లోపల ఏం జరిగిందన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ ఫుటేజ్‌నే పోలీసులు మాయం చేశారని ఆప్ ఆరోపిస్తోంది. 


ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆప్ మాత్రం ఎన్నో అనునామానాలు వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సమయంలో కావాలనే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని మండి పడుతోంది. రాఘవ్ చద్దాను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి అంటూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఢిల్లీ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 


Also Read: ​​Iran-India Relations: ఇరాన్ భారత్ మైత్రిని బలపరిచిన ఇబ్రహీం రైసీ, కీలక ఒప్పందాలపై సంతకాలు