Swati Maliwal Assault Case: ఇప్పటికే ఢిల్లీని లిక్కర్ స్కామ్ కేసు కుదిపేస్తుండగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడు దాడి చేసిన ఘటన రాజకీయాల్ని వేడెక్కించింది. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది ఈ కేసు. తనపై విచక్షణారహితంగా బిభవ్ కుమార్ దాడి చేశాడంటూ స్వాతి మలివాల్ ఫిర్యాదు చేశారు. అయితే...బిభవ్ కుమార్ కౌంటర్ కంప్లెయింట్ ఇచ్చాడు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించాడు. ఇదంతా కుట్ర అని కొట్టి పారేశాడు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా, బలవంతంగా సీఎం ఇంట్లోకి స్వాతి మలివాల్ దూసుకొచ్చారని ఆరోపించాడు. 


"ఇదంతా నాపై కుట్రపూరితంగా ఒత్తిడి పెంచేందుకు చేస్తున్నదే. మే 13వ తేదీన ఎలాంటి అనుమతి లేకుండా బలవంతంగా స్వాతి మలివాల్ సీఎం ఇంట్లోకి చొచ్చుకుని వచ్చారు. నేను ఆమెను ఆపేందుకు ప్రయత్నించాను. కానీ నా మాట వినలేదు. పైగా నన్ను ఇష్టమొచ్చినట్టు తిట్టింది. ఓ ఎంపీని ఆపేందుకు నీకెంత ధైర్యం, నీ స్థాయి ఏంటో తెలుసా అంటూ నాపై మండి పడింది. ఏదో ఓ కేసు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తా అని బెదిరించింది"


- బిభవ్ కుమార్


ఈ కంప్లెయింట్‌ని నార్త్ ఢిల్లీ డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి పంపాడు బిభవ్ కుమార్. అంతకు ముందు బిభవ్ కుమార్‌పై ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్‌ ఆప్‌పై మండి పడ్డారు. దాడి చేసిన మాట నిజమే అని ఒప్పుకున్న పార్టీ ఆ తరవాత యూటర్న్ తీసుకుందంటూ ఫైర్ అయ్యారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనను బీజేపీ ఏజెంట్‌గా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఆప్ మాత్రం దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.





మహిళా భద్రతా సిబ్బంది స్వాతి మలివాల్‌ని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు ఇందులో రికార్డ్ అయ్యాయి. ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా లోపలికి వచ్చి అందరినీ ఇబ్బందికి గురి చేశారని ఇప్పటికే ఆప్ నేత అతిషి తీవ్రంగా మండి పడ్డారు. ఈ వీడియో బయటకు వచ్చాక ఈ వివాదం మరింత రాజుకుంది. స్వాతి మలివాల్ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆప్ ఆరోపణల్ని జేపీ నడ్డా కొట్టి పారేశారు. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి అలవాటే అని మండి పడ్డారు. 


Also Read: Kyrgyzstan News: కిర్గిజిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు, అప్రమత్తమైన భారత్