Suvendu Adhikari to take oath as Bengal CM: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దశాబ్ద కాలానికి పైగా సాగిన మమతా బెనర్జీ పాలనకు తెరదించుతూ, నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత  సువేందు అధికారి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.   కోల్‌కతాలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సువేందును ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నుకున్నారు.  

Continues below advertisement

కేంద్ర నాయకత్వం సూచనల మేరకు, రాష్ట్రంలో సామాజిక సమతుల్యతను కాపాడేందుకు  ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని నిర్ణయించారు. ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలలో ఒకరు ఉత్తర బెంగాల్ ప్రాంతానికి చెందిన వారు కాగా, మరొకరు మతువా సామాజికవర్గం లేదా గిరిజన వర్గాల ప్రతినిధిగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ  ముగ్గురు నేతల  ఫార్ములా ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ వ్యూహరచన చేసింది.   

సువేందు అధికారికి ముఖ్యమంత్రి పీఠం దక్కడం వెనుక ఆయనకున్న క్షేత్రస్థాయి పట్టు , గత ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్‌లో ఓడించిన ధీరత్వం, ఈ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి  కూడా ఆమెను ఓడించడం  ప్రధాన కారణాలని తెలుస్తోంది. బెంగాల్ సంస్కృతిని, స్థానిక సమస్యలను క్షుణ్ణంగా తెలిసిన నేతగా సువేందు వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ, పారిశ్రామికాభివృద్ధిని పరుగులు తీయించడమే లక్ష్యంగా సువేందు తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు, కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్నందున కోల్‌కతాలో పండుగ వాతావరణం నెలకొంది. సువేందు అధికారి  రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు. శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సువేందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీ నమ్మిన బంటు 

  సువేందు అధికారి వయసు 55 ఏళ్లు. ఆయన తండ్రి శిశిర్ అధికారి మాజీ కేంద్ర మంత్రి . 1995లో కాంగ్రెస్‌తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సువేందు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చేరి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు. ముఖ్యముగా 2007లో జరిగిన  నందిగ్రామ్ భూపోరాటంలో  కీలక పాత్ర పోషించి, బెంగాల్‌లో కమ్యూనిస్టుల పాలన అంతమవ్వడానికి,  మమత అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడయ్యారు. ఎంపీగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, తర్వాతి కాలంలో టీఎంసీలో అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత పెరగడాన్ని నిరసిస్తూ 2020లో బీజేపీలో చేరారు.  2021 అసెంబ్లీ ఎన్నికల్లో సాక్షాత్తు మమతా బెనర్జీని నందిగ్రామ్‌లో ఓడించి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం సాగించారు. తాజా 2026 ఎన్నికల్లో భవానీపూర్,  నందిగ్రామ్ రెండు చోట్లా ఘనవిజయం సాధించడమే కాకుండా, బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా నిలిచారు. క్షేత్రస్థాయిలో అశేషమైన ప్రజాదరణ, మాస్ లీడర్‌గా ఉన్న ఇమేజ్ , పటిష్టమైన వ్యూహరచన సువేందును ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకెళ్లాయి.