Suspended SP of Bellary attempts suicide: కర్ణాటకలోని బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన గొడవలు చివరికి ఎస్పీ ఆత్మహత్యాయత్యానికి కారణం అయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయానికే సరిగ్గా కొన్ని గంటల ముందు పవన్ నజ్జూర్ (Pawan Nejjur) బళ్లారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, నగరంలో పరిస్థితిని అదుపు చేయడంలో వైఫల్యం చెందారని, ఉన్నతాధికారులకు సరైన సమాచారం చేరవేయలేదనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం ఆయనను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Continues below advertisement

సస్పెన్షన్ వేటు పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీ పవన్ నజ్జూర్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే వర్గీయులు  జనవరి 1, 2026న ఫ్లెక్సీలు కట్టే విషయంలో  గొడవపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ,  బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ ముదిరి రాళ్లు రువ్వుకోవడం, చివరకు కాల్పుల వరకు దారితీసింది. ఈ కాల్పుల్లో రాజశేఖర్ రెడ్డి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.         

ఈ కాల్పుల ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపిం ది. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు తదితరులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బళ్లారిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది. తాను విధుల్లో చేరిన వెంటనే సస్పెన్షన్ వేటు వేయడంతో ఎస్పీ కూడా ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.